ఏపీ ఫైబర్ నెట్ కేసు - సీఐడీ పీటీ వారెంట్‌పై ఏసీబీ కోర్టు విచారణ డిసెంబర్ 1కి వాయిదా - AP Fibernet case news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 10, 2023, 7:50 PM IST
ACB Court Hearing on Fibergrid PT Warrant: ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి.. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీఐడీ అధికారులు దాఖలు చేసిన పీటీ వారెంట్‌పై శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఈ నెల 30వ తేదీ వరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని.. దేశ అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావిస్తూ.. సీఐడీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. దాంతో తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్ (వచ్చే) నెల 1వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఫైబర్ నెట్ కేసులో టెరాసాఫ్ట్ ఆస్తులు అటాచ్ చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా కోర్టు విచారణ జరిపింది. ఆ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 17కు వాయిదా వేసింది.
Supreme Court on Fibernet Case: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేస్తూ.. నవంబర్ 30 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని సీఐడీని ఆదేశించింది. అనంతరం స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తీర్పును దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం వెల్లడించింది.