77th Independence Day Celebrations in AP High Court: "సమరయోధుల పోరాట ఫలితం వల్లే.. నేడు మనం స్పేచ్ఛగా జీవిస్తున్నాం"
🎬 Watch Now: Feature Video
77th Independence Day Celebrations in AP High Court: నాటి స్వాతంత్య్ర సమరయోధుల పోరాట ఫలితమే.. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా నేలపాడులోని హైకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. వివిధ మతాలు, వర్గాలు ఉన్నప్పటికీ అందరూ కలిసి స్వాతంత్య్రం కోసం ఏకతాటిపై పోరాడటం వల్లే బ్రిటీష్ వాళ్లను తరిమికొట్టామన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు నిత్యం పహరా కాస్తూ ఉండటం వల్లే దేశ ప్రజలకు స్వేచ్ఛ కొనసాగుతుందన్నారు. బలమైన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం కారణంగానే ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుందని.. ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
నిరక్షరాస్యత,పేదరికం, అవగాహన, చట్టాలు తెలియకపోవటం వల్ల చాలా మంది తమ హక్కుల్ని కాపాడుకోలేకపోతున్నారని జస్టిస్ ధీరజ్ సింగ్ తెలిపారు. ఆర్టికల్ 39 ప్రకారం అందరికీ న్యాయ సహాయం అందేలా చూడాలన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను తగ్గించేందుకు న్యాయాధికారులకు ఎప్పటికప్పుడు జ్యుడీషియల్ అకాడమీ ద్వారా శిక్షణనిస్తున్నారని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారన్నారు. 2019 తర్వాత వచ్చిన హైకోర్టు జడ్జిమెంట్లను ప్రాంతీయ భాషల్లోకి కృత్రిమ మేథస్సు పరిజ్ఞానంతో అనువాదం చేస్తున్నామన్నామని తెలిపారు. దీనివల్ల ఉన్నత న్యాయస్థానాల తీర్పులను ప్రజలందరూ సులువుగా అర్ధం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు.