Hindupuram Council Meeting: హిందూపురం కౌన్సిల్ సమావేశం రసాభాస.. నల్లరిబ్బన్లతో 13 మంది వైసీపీ కౌన్సిలర్లు - ఛైర్ పర్సన్ ఇంద్రజ
🎬 Watch Now: Feature Video
Hindupuram Council Meeting: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అధికార పార్టీ మధ్య వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఛైర్ పర్సన్ ఇంద్రజ తీరును వ్యతిరేకిస్తూ.. అసమ్మతి వర్గానికి చెందిన 13 మంది కౌన్సిలర్లు నల్ల రిబ్బన్లతో సమావేశానికి హాజరయ్యారు. ఛైర్‌పర్సన్ అవినీతి పాలన కొనసాగిస్తోందంటూ ఫ్లకార్డులు ప్రదర్శించి.. కౌన్సిల్ హాల్‌లో కింద కూర్చుని.. వైసీపీ కౌన్సిలర్‌లు నిరసన తెలిపారు. దీంతో హిందూపురం కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఛైర్‌పర్సన్ దిగిపోవాలంటూ నినాదాలు చేస్తుండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో ఛైర్‌పర్సన్ అర్ధాంతరంగా సమావేశాన్ని ముగిస్తున్నట్లు చెప్పడంతో వైసీపీ నిరసన కారులు కౌన్సిల్ హాల్‌లో కింద కూర్చొని నిరసన తెలిపారు.
మున్సిపల్లో జరిగిన అవినీతిపై వైసీపీ అధిష్ఠానం పెద్దలు చొరవ చూపాలంటూ అధికార పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. వైసీపీ కౌన్సిలర్ల ఛైర్‌పర్సన్ ఇంద్రజ తీరును ఎండగడుతూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఛైర్‌పర్సన్ పోడియం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశానికి ముందుగానే.. 13 వైసీపీ కౌన్సిలర్‌లు వైస్ ఛైర్మన్ బలరామిరెడ్డి ఛాంబర్‌లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కొంతమంది వైసీపీ కౌన్సిలర్ల భర్తలు కౌన్సిల్ హాల్ సమీపంలో ఉండడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అసహనానికి గురైన కౌన్సిలర్ల భర్తలు పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు.