100th Birthday Celebrations At NarasaRaopet : అమ్మను మించి దైవమున్నదా..! పండుగలా మాతృమూర్తి శతవసంతోత్సవం - ఉమ్మడి కుటుంబం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2023, 5:06 PM IST
100th Birthday Celebrations At NarasaRaopet : అమ్మనాన్నలను ఆర్ధిక భారమని అనాథలుగా వృద్ధాశ్రమాల్లో వదిలేస్తోన్న రోజులివి. అలాంటిది పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేటకు చెందిన ఆముదాలపల్లి ఇందుమతి కుటుంబసభ్యులు మాత్రం కనిపించని దేవుడు కంటే.. కనిపెంచిన తల్లే దైవంగా భావించారు. మాతృమూర్తి శతవసంతాల వేడుకల్ని అంబరాన్ని తాకేలా నిర్వహించి కన్నతల్లిపై ప్రేమను ఘనంగా చాటుకున్నారు. చిన్నా, పెద్దా అంతా బామ్మగారి ఆశీస్సులు తీసుకుని.. నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. బామ్మ వందేళ్ల పుట్టినరోజు వేడుకలను ఆమె కుటుంబీకులు ఘనంగా నిర్వహించారు. నూరు వసంతాల వేడుకల్లో విభిన్న రకాల పూలతో తమ తల్లి ఇందుమతికి పాదపూజ చేశారు. సుందరాకాండ పుస్తకాలతో బామ్మకు తులాభారం వేశారు. తమ మాతృమూర్తిని పల్లకిలో కూర్చోబెట్టి.. దారి వెంట పుష్పాభిషేకం చేస్తూ వీధుల్లో తిప్పారు. కుటుంబసభ్యుల అభిమానానికి బామ్మ ఉప్పొంగిపోయారు. ఇలా ఆత్మీయులు, బంధువుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆనందాన్ని ఇస్తోందన్నారు. తల్లి ఔన్నత్యాన్ని అందరికీ చాటిచెప్పేందుకే శతవసంతోత్సవాలను ఘనంగా నిర్వహించామని కుటుంబసభ్యులు తెలిపారు. ఉమ్మడి కుటుంబంలోని ఔన్నత్యాన్ని చాటుతున్నామన్నారు. తల్లిని మించిన దైవం లేదనే విషయాన్ని చెప్పేందుకే ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించామని తెలిపారు.