పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం... - పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం
🎬 Watch Now: Feature Video
విజయనగరం పైడితల్లి అమ్మవారి నెలరోజుల సంబరాల్లో మూడో ప్రధాన ఘట్టమైన తెప్పోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించారు. సిరిమానోత్సవం అనంతరం వచ్చే మంగళవారం ఆనవాయితీగా జరిగే ఘట్టమే తెప్పోత్సవం. తొలుత వనంగుడిలోని అమ్మవారికి స్నపనం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం గాడిఖానా సమీపంలోని పెద్ద చెరువుకు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి హంస వాహనంలో విహరింప చేశారు. రంగు రంగుల పుష్పాలు, విద్యుదీపాలతో అలకరించిన హంస వాహనంపై విహరించారు. మేళతాళాలు, విద్యుదీపాలంకరణ మధ్య అత్యంత వేడుకగా జరిగిన తెప్పోత్సవాన్ని తిలకించేందుకు పట్టణప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చారు. తెప్పోత్సవంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా మత్య్స, పోలీసుశాఖలు తగిన చర్యలు చేపట్టారు. ఈ నెలాఖరున చండీహోమంతో అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయని పైడితల్లి ఆలయ ఈవో తెలియచేశారు.