T20 World Cup : 2007 టీ20 ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియా గెలిచింది. 2011 వన్డే వరల్డ్‌కప్‌ను ఖాతాలో వేసుకొంది. ఇవి రెండూ ధోనీ నాయకత్వంలోనే సాధించింది. తర్వాత 2014లో పొట్టి కప్‌నకు అడుగు దూరంలో నిలిచిపోయింది. ప్రతి సారి ఫేవరేట్‌గా బరిలోకి దిగడం.. నిరుత్సాహపరచడం కామన్‌గా మారిపోయింది. గత టీ20 ప్రపంచకప్‌లో ఘోరంగా గ్రూప్ స్టేజ్‌కే పరిమితమై ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో కొత్త సారథిగా రోహిత్ శర్మ వచ్చాడు. అలాగే కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను బీసీసీఐ నియమించింది. మరి ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న పొట్టి కప్‌లో భారత్‌ను విజేతగా నిలపాలంటే రోహిత్-రాహుల్ కింకర్తవ్యం ఏంటి..?
అప్పటి నుంచి ఉన్నాడు..
తొలిసారి భారత్ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడు రోహిత్ శర్మ. ఇప్పుడు కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. గత ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ స్థానంలో హిట్‌మ్యాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి వరుసగా ద్వైపాక్షిక సిరీస్‌లను గెలుచుకుంటూ వచ్చాడు. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఇప్పుడు టీమ్‌ఇండియా తరఫున అత్యధిక టీ20లను గెలిపించిన రెండో సారథి రోహిత్ శర్మనే. మొదటి స్థానం కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ సొంతం. పొట్టి ఫార్మాట్‌కు కెప్టెన్‌గా రోహిత్ న్యూజిలాండ్‌పై తొలి సిరీస్‌ను కైవసం చేసుకొన్నాడు. 31 మ్యాచుల్లో 26 విజయాలు సాధించి 83.87 శాతంతో భారత సారథుల్లో టాప్‌గా నిలిచాడు.
ఇప్పటి వరకు రెగ్యులర్ సారథిగా రోహిత్ సొంతమైన టీ20 సిరీస్‌లు ఇవే..
- కివీస్‌పై 3-0
- వెస్టిండీస్‌పై స్వదేశంలో 3-0
- శ్రీలంక మీద 3-0
- ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై 2-1
- వెస్టిండీస్‌పై వెస్టిండీస్ వేదికగా 4-1
- స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1
- దక్షిణాఫ్రికాపై 2-1
ప్రధాన టోర్నీలో తేలిపోయి..
సిరీసుల్లో అదరగొట్టిన రోహిత్ - రాహుల్ కాంబినేషన్.. ఆసియా కప్ వంటి టోర్నమెంట్‌లో మాత్రం తేలిపోయింది. సూపర్-4 స్టేజ్‌లో శ్రీలంక, పాక్ చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. ఆటగాడిగా ఎంతో అనుభవం ఉన్న రోహిత్ శర్మ మెగా టోర్నీలో జట్టును సరైన దిశలో నడిపించాలి. బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేపోయాడనే విమర్శలు వచ్చాయి. డెత్ ఓవర్లను ఇప్పటికీ సెట్ చేయలేదు. ఓపెనర్‌గానూ భారీ ఇన్నింగ్స్‌లు ఆడటం లేదు. దూకుడుగా బ్యాటింగ్ ఆరంభిస్తున్నా.. అదే ఒరవడిని ఆసాంతం కొనసాగించలేక ఇబ్బంది పడ్డాడు.
తొలుత బ్యాటర్‌గా రాణించాలి..
ఓపెనింగ్ బ్యాటర్ కెప్టెన్ అయి ఉండి సరిగా ప్రదర్శన చేయకపోతే ఆ ప్రభావం మిగతా జట్టుపై కచ్చితంగా పడుతుంది. నాయకుడంటే కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. ముందుండి నడిపించాలి. బ్యాటర్ అయితే బ్యాటింగ్‌లో రాణించాలి. బౌలర్ అయితే అద్భుత ప్రదర్శన చేయాలి. అలా కాకుండా కెప్టెన్‌గా జట్టును అద్భుతంగా నడిపినా.. ఏదొక రోజు విమర్శలపాలు కాక తప్పదు.
ఇలాగే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తోపాటు టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రోహిత్ మొదట బ్యాటింగ్‌పైనా దృష్టి పెట్టాలి. గత పది ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ గణాంకాలను చూస్తే గొప్పగా ఏమీ లేవు. అతడి కంటే విరాట్ కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేసినా.. సెంచరీ సాధించలేదనే కారణంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు రోహిత్ మెగా టోర్నీలో రాణించకపోతే అతడి కెప్టెన్సీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.
కాస్త ఓపిక ఉండాలి భాయ్..
ఇటీవల ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీసుల్లో మ్యాచ్‌లను చూసిన పలువురు విశ్లేషకులు, మాజీలు చెబుతున్న మాట.. రోహిత్ కాస్త ఓపిక వహించు.. ఎందుకంటే ఫలితం అనుకున్నట్లుగా రాకపోతే మైదానంలోనే తీవ్ర అసంతృప్తి గురైన సందర్భాలు ఉన్నాయి. అది అతడి ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది.
అయితే రోహిత్‌ను కోపమొచ్చినా.. ఆనందమొచ్చినా ఆపలేమని అభిమానులు అంటుంటారు. ఇటీవల ఆసీస్‌తో సిరీస్ సందర్భంగా సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తిక్‌ను ఆటపట్టించిన వైనం వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అలాగే ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా యువ ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్ క్యాచ్ చేజార్చడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వీడియో కూడా నెట్టిట్లో ట్రోలింగ్‌కు గురైంది.
"కెప్టెన్‌గా తొలిసారి మెగా టోర్నీకి రావడం ఉత్సాహంగా ఉంది. వరల్డ్ కప్‌ను గెలవడమే ప్రధాన ధ్యేయం. అందుకోసం చాలా కష్టపడాలని తెలుసు" ఇదీ రోహిత్ శర్మ వార్మప్ మ్యాచ్‌ల తర్వాత చెప్పిన మాటలు.. ఐసీసీ ఈవెంట్‌లో మొదటిసారి సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. సహచరుల్లోని టాలెంట్‌ను బయటకు తెచ్చేలా మద్దతు ఇవ్వాలి. ఏదైనా పొరపాటు జరిగితే మందలించే సమయంలో సంయమనం పాటించాలి. మ్యాచ్ ముగిశాక మీడియా సమావేశాల్లో చెప్పడమే కాకుండా.. మైదానంలోనూ దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.
'19' ఫోబియాను తరిమేయాలి..
భారత బౌలర్లకు ఉన్న ఫోబియా.. 19వ ఓవర్ అని ఇప్పటికే చాలాసార్లు అనుకొన్నాం. అయితే టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో మాత్రం ప్రతి ఓవర్ కీలకం. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించి పరుగులు సమర్పించినా ఫలితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. బుమ్రా లేకపోవడంతో డెత్ ఓవర్లలో భారత్ కాస్త బలహీనంగా మారిందనే వాదనను రోహిత్ అధిగమించాలి. అందుకు తగ్గట్లుగా షమీ, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్‌తో బౌలింగ్ చేయిస్తే మంచిదనే సూచనలు సీనియర్లు చేశారు.
ఆరంభ ఓవర్లలో అదరగొట్టే భువనేశ్వర్‌తో ప్రయోగాలు చేయకపోవడం మంచిది. పవర్‌ప్లేలో భువీ నిలకడగా.. కట్టుదిట్టంగా బంతులను సంధించిన మ్యాచ్‌లను అనేకం చూశాం. ఆరంభంలో బంతిని వికెట్‌కు ఇరువైపులా స్వింగ్ చేయగల సమర్థుడు. అందుకే భువీ ఓవర్ల కోటాను త్వరగా పూర్తి చేయించాలని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా చెప్పాడు. ప్రత్యర్థి బ్యాటర్‌నుబట్టి బౌలర్‌ను బరిలోకి దించితేనే ఫలితం అనుకూలంగా రాబట్టే అవకాశం ఉంది.
ఇవీ చదవండి : ఏడేళ్ల తర్వాత బంగ్లా పర్యటనకు టీమ్‌ఇండియా.. షెడ్యూల్ ఇదే..
పాక్ పర్యటనకు టీమ్‌ఇండియా.. కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఏం అన్నారంటే?