వెనకటి పెద్దలు మార్గనిర్దేశం చేసిన మాటలమాటున దాగున్న ఆరోగ్య సూత్రాలు కొన్ని మాత్రమే నేడు అరుదుగా అనుసరిస్తున్నాం. నికార్సయిన కొన్నింటిని విస్మరిస్తున్నాం. భూగోళాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నిర్మూలించే ప్రయత్నంలో అరుదైన ఆరోగ్య ప్రదాలైన సంప్రదాయాల్ని ఓసారి మననం చేసుకోవాల్సి ఉంది. పొద్దు పొడవక ముందే ఆడవారు వాకిళ్ళలో చెత్తాచెదారం ఊడ్చేసి నీళ్ళు కల్లాపి చల్లి పేడతో అలికేవారు. తదుపరి ముగ్గు పిండితో చక్కగా ముగ్గులేసేవారు. ఏటవాలుగా పడుతున్న సూర్యరశ్మితో ఆ ఇల్లు తేజోవంతమై ఆహ్లాదంగా ఆరోగ్యకర వాతావరణాన్ని తలపించేది. నేలపై నీళ్లు చల్లడంతో దుమ్ము కణాలు అణగారి- ఆవుపేడ, సున్నంతోపాటు సూర్యరశ్మి తోడై క్రిమికీటకాలను ఆవాసంలోకి రాకుండా అడ్డుకుంటాయి. సహజంగా స్త్రీలు వంటపాత్రలు శుభ్రం చేసే సందర్భంలో ఎక్కువసేపు నీళ్లలోనే కాళ్లు తడపాల్సి ఉంటుంది. కాబట్టి కాళ్లకు పసుపు రుద్దుకునేవారు. బ్యాక్టీరియా సోకకుండా యాంటీసెప్టిక్‌గా, యాంటీ బయాటిక్‌గా పసుపు పనిచేస్తుంది. పెళ్ళిళ్లలోనూ వధూవరులకు నలుగు పెట్టి పసుపు నీళ్ల స్నానం చేయించడం తెలిసిందే. సాధారణంగా శరీరం నలతగా ఉన్నప్పుడు- వేడినీళ్లలో వాయిలాకు వేసి మరిగించిన నీళ్లతో స్నానం చేస్తే... ఎలాంటి నొప్పులున్నా కాస్తంత ఉపశమనం లభిస్తుంది. అలాగే గోరువెచ్చని నీళ్లలో సున్నిపిండితో స్నానం మంచిదని పెద్దలు చెబుతారు. పిల్లలకు అమ్మవారు(వైరల్ ఇన్ఫెక్షన్) సోకితే క్రిమికీటకాల పీడ వదలడానికి వేపాకుల్ని రోగి చుట్టూ రక్షణ కవచంలా పేర్చడం వంటి ఎన్నో పూర్వాచారాల్ని మరచిపోతున్నాం.
క్రిములు ఇంట్లోకి రాకుండా
మన ఇంటికి అతిథులైనా, బంధువులైనా వచ్చారంటే వెంటనే చెంబుతో నీళ్లు ఇచ్చి స్వాగతించడం ఆనవాయితీ. బయటినుంచి వస్తారు గనుక కాళ్లు కడుక్కుని లోపలికి రావాలని చెప్పేవారు. చెప్పులు కూడా ఆరుబయట వదిలేయడం అప్పటివారి తప్పనిసరి అలవాటు. తద్వారా క్రిములు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. అలాగే వండిన భోజనం వెంటనే తినమని పెద్దలు సూచించేవారు... చల్లారిన పదార్థంలో క్రిములు చేరతాయని! అప్పట్లో ఆహార పదార్థాల తయారీకి మట్టి, ఇత్తడి, రాగి పాత్రలను ఉపయోగించిన తీరు అద్భుతం. వాటివల్ల పోషకాల నిల్వ పుష్కలంగా సమకూరుతుంది. కాలుష్యం బారిన పడే అవకాశమే లేదు. పర్వదినాల్లో ఇంటి గుమ్మాలకు తప్పనిసరిగా తోరణాలు కట్టేవారు. గతంలో ఇళ్లలో సూక్ష్మక్రిముల తాకిడికి నివారణగా సాంబ్రాణి పొగ వేసేవారు.
పిండి వంటకాల ఆరోగ్య రహస్యాలు..
హిందూ సంప్రదాయ పండుగల్లో దర్శనమిచ్చే రకరకాల పిండి వంటకాల ప్రత్యేకతల వెనక అన్న ఆరోగ్య రహస్యాలున్నాయి. తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ రోజున పచ్చడిలో, శ్రీరామనవమి నాటి బెల్లం పానకంలోనూ శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే దసరా సంక్రాంతి పండుగ ప్రత్యేక వంటకాల్లో వాడే బెల్లం, నువ్వులు, వాము వంటివి దేనికదే ప్రత్యేకత కలిగి ఉన్నాయి. బతికుంటే బలుసాకు తినొచ్చునన్న సామెత ఊరకే పుట్టలేదు. పొలాల గట్లమీద, చిత్తడినేలల్లో బలుసాకు అరుదుగా లభిస్తుంది. దీన్ని పల్లెల్లో కొందరు వినాయకచవితి సమయంలో పులుసుగా, పప్పుతోనో వండుకుని తినడం అలవాటు. దీన్ని పచ్చడిగా తింటే అతిసారం తగ్గించడానికి, ఆకలిని పెంచడానికి తోడ్పడుతుంది. ఆషాఢమాసంలో పెట్టుకునే గోరింటాకు శరీరంలో వేడిని తొలగించి ఒత్తిడిని జయిస్తుంది. భారతీయ హిందూ సంప్రదాయంలో ‘బొట్టు’కు అత్యంత ప్రాధాన్యం ఉంది. నుదుట దృష్టి కేంద్రంపై కుంకుమ బొట్టు పెడితే ఏకాగ్రతతో కూడిన మానసిక ఉల్లాసం ఉట్టిపడుతుంది.
భారతీయుల తొలి సంస్కారం.. నమస్కారం
వ్యక్తులు తారసపడితే చేతులు జోడించి నమస్కరించడం ఎంతో ఆరోగ్యకరం. ఇది భారతీయుల తొలి సంస్కారం. పూర్వం ఆదివాసులలో సామాజిక దూరం కాస్త కఠినంగా ఉండేది. ఆడపిల్లలు రజస్వల అయితే ఇంటికి దూరంగా ఉంచేవారు. ఏ పద్ధతి పాటించినా మానవతా దృక్పథంతో కూడి ఉండాలి. ఆ కాలంలో జనసమూహంలో ఎవరైనా తుమ్మినా అపచారంగా భావించేవారు. దాని చెడు ప్రభావం దృష్ట్యా కొన్ని సామాజిక దూరాలు పాటించేవారు. అలాగే అశుభాలకు సంబంధించిన ఆచారాల్లోనూ అదే జాగ్రత్త కనిపించేది. క్షౌరశాలకు, అంత్యక్రియలకు వెళ్లి వస్తే దేన్నీ తాకకుండా స్నానం చేశాకే ఇంట్లోకి వెళ్లడం అప్పటి సంప్రదాయం. వ్యాధులు సంక్రమించకుండా ఓ జాగ్రత్తగా ఇది సూచించేవారు. పురుళ్ల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలు ఉండేవి. మైల, అంటు వంటివి పాటించడంతో ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం. వాటిని మూఢాచారాలుగా మార్చేసిన కొందరివల్ల అటువంటి పద్ధతులపై విరక్తి, అనాసక్తి ఏర్పడ్డాయి. అందులోని శాస్త్రీయతను ఆరోగ్య సూత్రాలను కొట్టిపారేయలేం. మానవత్వానికి మచ్చలేని విధంగా ఆనాటి సంప్రదాయాలను పాటించడం, అనుసరించడం నేడు చాలా అవసరం. కరోనా ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఆ తరం అలవాట్లను కొంతమేరకైనా ఒంటపట్టించుకోవాల్సిందే.
- గుమ్మడి లక్ష్మీనారాయణ (సామాజిక విశ్లేషకులు)