Tips For Silky Hair In Winter : మిగతా కాలాలతో పోలిస్తే చలికాలంలో మన జుట్టుకు చాలా చిక్కులే ఎదురవుతాయి. వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండటంతో జుట్టు పొడిబారుతుంటుంది. వెంట్రుకలన్నీ కాంతి హీనంగా కనిపిస్తాయి. జుట్టు కొసలు చిట్లి పోయి నిర్జీవంగా ఉంటాయి. అయితే సీజన్ మార్పులకు అనుగుణంగా జుట్టు సంరక్షణ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు నిగనిగలాడుతుందంటున్నారు నిపుణులు. చలికాలంలో జుట్టు పొడిబారకుండా ఉండాలంటే ఏం చేయాలి ? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు పొడిబారకుండా ఉండటానికి చిట్కాలు :
- చాలా మంది చలికాలంలో వేడి నీటితో తలస్నానం చేస్తుంటారు. దీని వల్ల తలలో సహజ నూనెల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే నెలకు రెండు మూడు సార్లు మాత్రమే గోరు వెచ్చని నీటితో చేసి.. మిగతా సమయాల్లో చల్లని నీటితో చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పోషణ కోల్పోకుండా ఉంటుంది.
- చలికాలంలో షాంపూని ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తగ్గిపోతాయి. దీంతో జుట్టు పొడిబారిపోతుంది. అందుకే వారానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే షాంపూని ఉపయోగించండి.
- షాంపూని ఉపయోగించిన తరవాత కండీషనర్‌ను తప్పకుండా ఉపయోగించండి. కండీషనర్ జుట్టును హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తుంది.
- హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రెయిటనింగ్ వంటి మిషన్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారి దెబ్బతింటుంది. వీటిని ఎక్కువగా ఉపయోగించకుండా జుట్టును సహజంగా వదిలివేయండి.
- జుట్టును మృదువుగా, కాంతివంతంగా మార్చడంలో బియ్యం పిండి, పాలు, తేనె సహాయపడతాయి. దీనికోసం ఈ మూడింటిని తీసుకొని మిశ్రమం తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాలు ఉంచి తరవాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నిగనిగలాడే జుట్టు మీ సొంతం అవుతుంది.
- సహజ సిద్ధంగా ఇంట్లో అవకాడో, అరటి, యోగర్ట్, కోడిగుడ్లతో తయారుచేసే హెయిర్ మాస్క్ ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. మార్కెట్లో లభించే హెయిర్ మాస్క్‌లను ఉపయోగించడం వల్ల కూడా జుట్టు పొడిబారడాన్ని నివారించవచ్చు.
- జుట్టు కుదుళ్లకు తగిన పోషణ అందాలంటే రెగ్యులర్‌గా నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. కొబ్బరి నూనె, ఆర్గాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వంటివి ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- ఈ చలికాలంలో వీచే చల్లటి గాలులకు వెంట్రుకలు, జుట్టు తొందరగా పొడిబారిపోతుంది. అలాగే చుండ్రు సమస్య పెరుగుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక మార్గం ఉంది. అదేంటంటే బయటకు వెళ్లినప్పుడు క్యాప్ వంటివి ధరించాలి. తడి జుట్టుతో అస్సలు బయటకు వెళ్లవద్దు.
- చలికాలంలో జుట్టు ఆరోగ్యం బాగుండటానికి మంచి ఆహారం తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12, విటమిన్ డి, అధికంగా ఉన్న ఆహారం తినాలి. గింజలు, బెర్రీస్, కోడిగుడ్లు, మిరియాలు మొదలైనవి జుట్టుకు మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.
- తల స్నానం చేసిన తరవాత జుట్టును ఆరబెట్టడానికి, తుడుచుకోవడానికి కాటన్ టవల్స్‌కు బదులుగా మైక్రోఫైబర్ టవల్ ఉపయోగించాలి. ఇవి జుట్టును మృదువుగా చేస్తాయి.
వేడి నీటి కోసం హీటర్ వాడుతున్నారా? ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త!
మీ పిల్లలు ఫోన్ వదలట్లేదా? - ప్రాణాంతకం కావొచ్చు - ఇలా వదిలించండి!