మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఉదర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉదర భాగంలో గ్యాస్‌కు కారణమయ్యే ఆహార పదార్థాలను ఎటువంటి పరిస్థితిలోనూ తినకూడదు. పొట్టను కలుషితం చేసే వాటిని, కడుపులో మంట పుట్టించే వాటిని అస్సలు తీసుకోకూడదు. ఇలా తినడం వల్ల అజీర్తి చేస్తుంది. ఆమ్లాల ఉత్పత్తి జరిగి కడుపు ఉబ్బరం, నొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిజానికి పొట్టలో గ్యాస్ సమస్య అనేది ఇప్పుడో సాధారణ విషయంగా మారిందనాలి.
అసలు కారణాలు ఇవే..
అతిగా తినేయడం ఎప్పుడూ ప్రమాదమే. మానసిక ఒత్తిడి, దానికి కారణమయ్యే రోజువారీ జీవన శైలి కాలక్రమంలో వ్యాధుల్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మలబద్ధకం లేదా అతిసారానికి దారితీస్తాయి. వేళకు తినకపోవడం, రాత్రిళ్లు నిద్రలేమి, నిరంతర ఆలోచనలు.. ఇవన్నీ జీర్ణవ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయి. ఏ కారణం లేకుండానే కోపం వస్తుంటుంది. విసుగు, నిరాశ చుట్టుముడుతూ ఉంటాయి. వీటన్నింటి నుంచి బయటపడాలంటే తగిన ఆహారాన్నే తీసుకోవాలి.
ముందు జాగ్రత్త ఉండాల్సిందే..
గ్యాస్‌ను ప్రేరేపించే తిండిని మానేయాలి. కందిపప్పు, శనగపిండి, గోధుమ వంటివి అంత త్వరగా జీర్ణం కావు. బీన్స్, చిక్కుళ్లు, బఠాణీ, క్యాబేజీ, ఉల్లి, క్యాలీఫ్లవర్, మరికొన్ని పచ్చి కూరగాయలు కూడా వెంటనే అరగవు. పాలు, పాల ఉత్పత్తి పదార్ధాలు సైతం అంతే. మరీ అధికంగా ఫైబర్ ఉన్నవి సత్వరం జీర్ణమవక, నానా ఇబ్బందులకు గురిచేస్తాయి.అవి పొట్టలో గ్యాస్ ప్రకోపానికి మూలమవుతాయన్న మాట. అందువల్ల తేన్పులు, కడుపు నొప్పి వంటివి వస్తాయి.
మరి చేయాల్సిందేమిటి?
ఆహార పదార్థాల్ని హడావుడిగా కాకుండా, నిదానంగా నమిలి తినాలి. కూరల్లో వాడే ఆవాలు, యాలకులు, జీలకర్ర, పసుపు, మొదలైనవి చక్కని జీర్ణక్రియకు దోహదపడతాయి. ఇంగువ, వెల్లుల్లి వంటివీ ఆరోగ్య భాగ్యానికి ఉపకరిస్తాయి. వంటకాల్లో ఉపయోగించే నూనె విషయంలో ముందు జాగ్రత్త అవసరం. కొవ్వుకు మూలమయ్యే వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన వాటిని అదేపనిగా వాడొద్దు. పులిసి ఉన్న పిండి వంటి వాటిని పారేయాలి. పులుపు పదార్థాలతో పాటు, కొన్ని రకాల పప్పు దినుసుల జోలికి వెళ్లకూడదు. శీతల పానీయాలు అసలే వద్దు.
వ్యాయామం, నిద్ర అత్యవసరాలు..
అన్నింటికంటే ప్రధానం నిత్య వ్యాయామం. ప్రత్యేకించి ప్రాణాయామం, ఇతర ఆసనాలను రోజూ చేస్తుండాలి. మత్తు పదార్థాల జోలికి అసలే పోకూడదు. శుభ్రంగా వండిన, తగినంతగా ఉడికిన ఆహారాన్నే స్వీకరించాలి. ప్రశాంతంగా ఉంటూ, సరిపడా నిద్రపోతుండాలి. ఇదంతా ఒక్క రోజులో అలవడేది కాదు. నిద్రాహారాల్లో ఒక క్రమ పద్ధతిని అలవాటు చేసుకుంటేనే వచ్చేది. ఏం తింటున్నామో, అందులో ఎటువంటి విధివిధానాలు పాటిస్తున్నామో ముందుగానే తెలిసి మసలుకుంటే చాలు. పొట్టలో గ్యాస్ బెడద నుంచి ఇట్టే బయటపడవచ్చు.