Rice Water Health Benefits : మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆహారపు అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇందులో అనారోగ్యకర అలవాట్లే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే విషయం. వీటివల్ల జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిని జనాలు కూడా గుర్తిస్తున్నారు. అందుకే.. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పూర్వపు ఆహారపు అలవాట్లను తవ్వి తీస్తున్నారు. ఈ క్రమంలో చూసుకున్నప్పుడు.. ఓ అద్భుతమైన అలవాటు తెరపైకి వచ్చింది. అదే గంజి తాగడం!
పూర్వపు రోజుల్లో అన్నం వండే సమయంలో గంజిని వార్చేవారు. అందులో కాస్త ఉప్పు వేసుకొని వేడి వేడిగా తాగేవారు. 80s, 90's కిడ్స్ వరకూ ఈ విషయం తెలుసు. కానీ.. ఆ తర్వాత కాలంలో గంజి తాగడం అనేది తగ్గిపోయింది. ఇప్పుడు అసలు గంజి తీయడం అన్నదే కనుమరుగైంది. దీనివల్ల ఎన్నో పోషకాలను మనం కోల్పోతున్నామని నిపుణులంటున్నారు. గంజిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని వారు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడం..
గంజి తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు, ఆరోగ్యకరమైన బరువును కొనసాగించవచ్చని అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం వెల్లడించింది. బరువు తగ్గాలనుకునే వారికి గంజి మంచి ఆహారం. ఇందులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పీచు ఉండటం వల్ల.. కొంచెం తీసుకోగానే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఫలితంగా ఎక్కువ తినడం అదుపులో ఉంటుంది. తద్వారా.. బరువు నియంత్రణలో ఉంటుంది.
ఏళ్లనాటి మైగ్రేన్ బాధలు - ఇలా తిండితోనే తగ్గించుకోవచ్చు!
జీర్ణ ప్రక్రియ సక్రమంగా..
కొంతమందిలో జీర్ణప్రక్రియ సజావుగా సాగదు. ఇలాంటివారు ఏం తిన్నా అరిగించుకోలేరు. ఈ సమస్యను పరిష్కరించాలంటే ఒక్కటే మార్గం. అదేంటంటే, రోజూ ఉదయాన్నే ఓ చిన్న గ్లాసు గోరువెచ్చని గంజిని తాగడం. దీనివల్ల జీర్ణప్రక్రియ వేగంగా జరుగుతుందని నిపుణులంటున్నారు. అలాగే కడుపు నొప్పి, ఇతర సమస్యలు కూడా దూరమవుతాయి.
నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం..
ప్రతి ఆడపిల్లకూ నెలసరి నొప్పులు అనుభవమే. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే.. ఆ సమయంలో రోజూ ఒక గ్లాసు గంజి తాగాలి. దీనివల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే ఒత్తిడి, భావోద్వేగాలు అదుపులో ఉంటాయంటున్నారు.
- వయసు పైబడుతున్న కొద్దీ.. ఒంట్లో శక్తి గణనీయంగా తగ్గిపోతుంటుంది. దీనివల్ల చిన్నపనికే త్వరగా అలసిపోతుంటాం. ఇలాంటి వారు రోజువారి ఆహారంలో గంజిని తీసుకోవడం వల్ల చురుగ్గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. గంజి నీళ్లు శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ని సమన్వయం చేస్తాయంటున్నారు.
- భారతదేశంలో జరిగిన ఒక అధ్యయనంలో గంజి నీరు తాగడం వల్ల మొటిమలు తగ్గి, చర్మ ఆరోగ్యం మెరుగుపడిందని తేలింది.
- గంజిని రోజు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని విటమిన్ బి,ఐరన్, జింక్, మెగ్నీషియం వంటివి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. దీంతో ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి.
- గంజి నీరు తాగడం వల్ల రక్తపోటు 0.7% తగ్గిందని ఒక జపనీస్ అధ్యయనంలో పరిశోధకులు కనుగొన్నారు.
బరువు తగ్గడానికి తిండి బంద్ చేయొద్దు - ఈ పనులు చేయండి - తగ్గడం గ్యారెంటీ!
చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేస్తే ఎలాంటి ఖర్చు లేకుండా సమస్యకు చెక్ పెట్టొచ్చు!