కరోనా వల్ల ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. అటు వైరస్ సోకినపుడు వస్తున్న ఆరోగ్య సమస్యలు.. ఇటు కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత శరీరంలో కలుగుతున్న మార్పులకు ప్రజలు భయపడిపోతున్నారు. శరీరంలోని ఒక్కో అవయవంపై ఒక్కో విధంగా ప్రభావం చూపుతోందీ మహమ్మారి. తాజాగా.. గుండెపై కరోనా ప్రభావం ఎంతమేర ఉంటుందనే విషయంపై పరిశోధనలు జరిగాయి. అందులో పలు ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి.
గుండెపై కొవిడ్ ఎఫెక్ట్..
హృదయాన్ని కొవిడ్ ప్రత్యక్షంగానే ప్రభావితం చేస్తుంది. కొవిడ్ వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. ఇది మయోకార్డైటిస్, పెరికార్డైటిస్కు దారితీస్తుంది. అంటే గుండె కండరాలు, గుండె చుట్టుపక్కల వాపు ఏర్పడుతుంది. కొవిడ్ కారణంగా వచ్చిన ఇన్ఫ్లమేషన్తో రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా ఉంది. దీని వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువనే చెప్పాలి.
ఇదీ చూడండి:- 'కరోనా తగ్గినా.. ఆ 203 లక్షణాలతో చిక్కులు!'
కరోనా వల్ల గుండె కొట్టుకునే తీరులో అనూహ్య మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కోసారి గుండె పనిచేయడం మానేస్తుంది. కాళ్లు, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టుకుపోతుంది.
కరోనా సోకిన వారిలో 10-30శాతం మందికి 'దీర్ఘకాల కొవిడ్' సోకుతున్నట్లు నివేదికలు బయటకు వస్తున్నాయి. ఛాతినొప్పి, గుండె సిర ఉబ్బడం, గుండె కొట్టుకునే వేగం అనూహ్యంగా పడిపోవడం లేదా పెరిగిపోవడం వంటివి లక్షణాలుగా ఉన్నట్టు ఓ నివేదిక పేర్కొంది.
ఇక ప్రస్తుత ప్రపంచాన్ని కుదిపేస్తున్న డెల్టా వేరియంట్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. దీని వల్ల గుండెకు ఎన్ని సమస్యలు వచ్చిపడతాయి అనేది ఈ పరిశోధనల ఫలితాల వల్ల స్పష్టమవుతుంది.
టీకాలతో సైడ్ ఎఫెక్ట్స్?
ఆస్ట్రాజెనికా టీకా తీసుకుంటే రక్తం గడ్డకడుతోందని ఇటీవలి కాలంలో వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఎమ్-ఆర్ఎన్ఏ కొవిడ్ టీకాలకు.. గుండెలో అరుదైన ఇన్ఫ్లమేషన్ ఏర్పడటానికి మధ్య సంబంధం ఉందని కనుగొన్నారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని అయితే అవి అరుదుగానే ఉంటాయని స్పష్టం చేశారు.
ఆస్ట్రేలియాలో 5.6మిలియన్ మందికి ఫైజర్ టీకా పంపిణీ చేయగా.. గుండె ఇన్‌ఫ్లమేషన్‌గా అనుమానిస్తున్న 111 కేసులు బయటకు వచ్చాయి. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఎలాంటి మరణాలు నమోదుకాలేదు.
అయితే ప్రజలు భయపడకుండా టీకాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. 6 నెలల ముందు మయోకార్డైటిస్, పెరికార్డైటిస్ సోకినట్టు తేలితే ఓసారి డాక్టర్‌ను సంప్రదించాలని చెబుతున్నారు. టీకా తీసుకున్న తర్వాత ఛాతి నొప్పి, కళ్లు తిరిగిపడిపోవడం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనపడితే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని స్పష్టం చేస్తున్నారు.
గుండెకు 'పరీక్ష'
కరోనా కాలంలో గుండెకు సంబంధించిన చికిత్సలు, పరీక్షలపై ప్రజలు అశ్రద్ధ వహిస్తున్నారు. ఇది మంచిది కాదు. దీర్ఘకాల గుండె రోగాలు పెరిగిపోతాయి. అందువల్ల ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. అవసరమైన చికిత్స తీసుకోవాలి.
ఇదీ చూడండి:- Post Covid Diet : ఇమ్యూనిటీ పవర్ పొందాలంటే.. ఈ డైట్ పాటించాల్సిందే