Home Remedies For Gout Pain In Toes And Feet : మన శరీరంలోని రక్తంలో యూరిక్ యాసిడ్ అసమతుల్యత వల్ల ఏర్పడే సమస్యలే గౌట్. ఇలా రక్తంలో పెరిగిన యూరికామ్లం స్పటికాలుగా మారి కీళ్లలోకి చేరి తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి 30 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్నవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది. యూరికామ్లం మనం తీసుకునే ఆహారంలోని ప్రొటీన్లు జీర్ణమైన తర్వాత ఏర్పడే ఒక విష పదార్థం. ప్రాథమికంగా ఈ పదార్థం రక్తంలో కలిసి శుద్ధి కోసం మూత్ర పిండాలకు చేరుతుంది. ఆ మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేసి అందులోని విషపదార్థాలను, వ్యాధికారక పదార్థాలను వేరు చేసి మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు పంపుతాయి.
మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలి వంటి ఏదో ఒకట్రెండు కీళ్లకు పరిమితమై క్రమేపి ఇతరత్రా జాయింట్లకు సైతం వ్యాపిస్తుంది. నొప్పితో కూడుకున్న ఆర్థ్రరైటిస్ మళ్లీ మళ్లీ రావడాన్ని గౌట్‌గా భావించాలి. కీళ్లలో ఉండే ద్రవాల్లో యూరిక్ యాసిడ్ ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడం ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు. అంతేకాకుండా రక్తంలోని యూరిక్ యాసిడ్‌ను రక్త పరీక్షల ద్వారా ద్వారా తెలుసుకోవచ్చు.
వ్యాధి కారకాలు
కీళ్ల నొప్పులకు అనేక కారణాలుంటాయి. వయసు పెరిగే కొద్దీ కీళ్ల అరుగుదల ఉండటం వల్ల వస్తాయి. లేదంటే ఇంతకు మందు ఆ ప్రాంతంలో ఏదైనా గాయమై ఆ సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే కూడా వస్తాయి. దీన్ని సెకండరీ ఆస్ట్రో ఆర్థ్రరైటిస్ అంటారు. ఇవి రెండూ కాకుండా కీళ్ల వాతం ద్వారా నొప్పులు వస్తాయి. దీన్ని రూమటాయిడ్ ఆర్థ్రరైటిస్ అని పిలుస్తారు. ఇది సాధారణంగా మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. విటమిన్- డీ లోపం వల్ల ఈ కీళ్ల నొప్పులు వచ్చే అవకాశముంది. కొన్ని సార్లు వైరల్ ఫీవర్లు వచ్చి, తగ్గే సమయంలో ఈ నొప్పులు వచ్చే అవకాశం అధికంగానే ఉంది. దాన్ని పాలీ ఆర్థ్రరైటిస్ అంటాం. సోరియాసిస్ వల్లా సంభవించవచ్చని వైద్యులు చెబుతారు.
ప్రభావం చూపే ప్రాంతాలివే!
"ఈ మధ్య కాలంలో గౌట్ ఆర్థ్రరైటిస్ కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. బ్లడ్‌లోని వ్యర్థ పదార్థమైన యూరిక్ యాసిడ్.. అది కీళ్ల మధ్యలో చేరడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ వ్యాధి మొదటి సారి వచ్చి తగ్గిన తర్వాత.. మళ్లీ దాడి చేయడానికి ఒకట్రెండు సంవత్సరాలు పట్టొచ్చు. చీలమండలు, కీళ్లు, మణికట్టు, చేతివేళ్లు, మోచేతి ప్రాంతాల్లో కూడా ఈ వ్యాధి ప్రభావం ఉంటుంది. దీని బారిన పడిన జాయింట్లు.. వాపు, నొప్పితో ఎర్రగా మారతాయి. గౌట్ అభివృద్ధి చెందే ప్రమాద కారకాల్లో ఉబకాయం, అధిక రక్తపోటు, మద్యం తీసుకోవడం, మూత్ర పిండాల అసాధారణ పనితీరు ఉన్నాయి. కొన్ని రకాల మందులు, వ్యాధులు సైతం యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచి వ్యాధి బారిన పడేందుకు దోహదం చేస్తాయి." అని వైద్యులు చెబుతున్నారు.
"అసలు ఈ కీళ్ల నొప్పులు ఎందుకు వస్తున్నాయో ముందుగా నిర్ధరించుకోవాలి. దీనికోసం కొన్ని రకాల రక్త పరీక్షలు ఉంటాయి. అదే కీళ్ల వాతమైతే ఆర్.ఎ. ఫాక్టర్, యాంటీ సీసీపీ, సీఆర్పీ, ఏఎన్ఏ ప్రొఫైల్, సీబీపీ, విటమిన్ పరీక్షలు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఎక్స్ రే కూడా చేయాల్సి రావచ్చు. ఒబెసిటీ ఉన్న వాళ్లు బరువు అదుపులో పెట్టుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. ఫ్రైడ్, జంక్ ఫుడ్ మానేయాలి. బదులుగా తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల జాయింట్స్ ఆరోగ్యంగా ఉంటాయి. సోరియాసిస్ ఉన్న వాళ్లు దాన్ని అదుపులో పెట్టుకుంటే ఇది కూడా కంట్రోల్లోనే ఉంటుంది. అప్పటికీ నొప్పులు తగ్గకపోతే జాయింట్లలో గుజ్జు, స్టిరాయిడ్ ఇంజెక్షన్లు ఇస్తారు. ఒకవేళ కీళ్లు పూర్తిగా అరిగిపోయిన పక్షంలో జాయింట్ రిప్లేస్మెంట్ అనే శస్త్రచికిత్స ద్వారా ఈ నొప్పి నుంచి విముక్తి కల్పిస్తారు"
-డాక్టర్ సాకేత్, ఆర్థోపెడిక్ సర్జన్
ఇలా చేయండి!
"ఈ సమస్య నుంచి బయటపడి, శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గేందుకు రోజూ 10-12 గ్లాసుల నీళ్లు తాగాలి. చక్కరతో చేసిన పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఈ వ్యాధిగ్రస్థులు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. వారు క్రమం తప్పకుండా వీటిని వాడితే నొప్పి తిరిగి రాదు. వీరు రెగ్యులర్‌గా తీసుకునే ఆహారంలో విటమిన్- సి ఉండేలా చూసుకోవాలి. అలాగే పాలు, పాల ఉత్పత్తుల్ని తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిని అవి తగ్గిస్తాయి. సమస్య ఎక్కువగా వేధిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి." అని వైద్యులు తెలిపారు.
హార్ట్ ఎటాక్ వస్తే సీపీఆర్ ఎలా చేయాలి? సింపుల్ స్టెప్స్ ఇవిగో!
చలికాలంలో డేట్స్ తినడం వల్ల లాభాలు ఇవే!-తెలిస్తే వదిలిపెట్టరు సుమీ!