Heart Disease Laser Treatment : ఒకప్పుడు గుండె జబ్బుల బాధితులు చాలా అరుదుగా ఉండేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అనేక మంది హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్ వంటి గుండె సంబంధిత వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎందరో ప్రాణాలు సైతం వదిలేస్తున్నారు. గుండెకు తగిన మోతాదులో రక్తం సరఫరా అవ్వకుండా రక్త నాళాల్లో గడ్డకట్టినప్పుడు ఆయా సమస్యలు వస్తుంటాయి. అప్పుడు గుండెకు వైద్యులు స్టంట్ వేస్తారు. దీంతో మూసుకుపోయిన రక్తనాళాలు తెరుచుకుని మళ్లీ యథావిధిగా రక్తం సరఫరా అవుతుంది. అయితే గుండె సమస్యలు వచ్చినప్పుడు స్టంట్ వేయకుండా.. లేజర్ చికిత్సతో సులభంగా నయం చేయవచ్చని దిల్లీ వైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ చికిత్స గురించి తెలుసుకుందాం.
Heart Blockage Laser Treatment : గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్ సహా దేశంలోని అనేక ఆస్పత్రుల్లో గుండె సమస్యలతో బాధపడేవారికి స్టంట్ బదులు లేజర్ థెరపీతో చికిత్స చేస్తున్నారు. స్టంటింగ్ ప్రక్రియ కంటే లేజర్ థెరపీ చాలా సులభమైనదని మేదాంత ఆస్పత్రి కార్డియాలజీ విభాగం ఛైర్మన్ డాక్టర్ ప్రవీణ్ చంద్ర చెప్పారు. "యాంజియోప్లాస్టీ చికిత్స చేసిన తర్వాత కొన్నిసార్లు రోగికి స్టంట్ వేసినా అది పనిచేయదు. ఆ సమస్యను స్టంట్ ఫెయిల్యూర్ అంటారు. అటువంటి వారికి లేజర్ చికిత్స ద్వారా ధమనులను (Arteries) మొదట శుభ్రం చేస్తున్నాం. ఆ తర్వాత మెడికల్ బెలూన్ సహాయంతో.. ధమనుల్లోకి ఔషధాన్ని విడుదల చేస్తున్నాం. దీంతో లోపల ఏర్పడ్డ అడ్డంకి పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత ఇంకెప్పుడు బ్లాక్‌లు ఏర్పడవు. ఈ చికిత్స తర్వాత స్టంట్లు వేయాల్సిన అవసరం కూడా ఉండదు" అంటూ డాక్టర్ ప్రవీణ్ చంద్ర చెప్పుకొచ్చారు.
లేజర్ సర్జరీ ఎలా చేస్తారు?
What Is Laser Heart Surgery: "లేజర్ థెరపీలో ధమనుల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి అధిక శక్తి కాంతి (లేజర్) విడుదల చేసే కాథెటర్ ఉపయోగిస్తాం. అది సిరలకు (Veins) ఎటువంటి హాని కలిగించకుండా బ్లాక్‌ను తొలగిస్తుంది. ఈ చికిత్సను ప్రతి రోగిలో ప్రయోగించలేం. ముందుగా రోగిని పరీక్షించి సిరల్లో ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో తెలుసుకుంటాం. ఆ తర్వాత లేజర్ టెక్నాలజీ విజయవంతమవుతుందో లేదో అన్న విషయాన్ని పరిశీలించి చికిత్స చేస్తాం. ఈ లేజర్ చికిత్సకు మూడు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. స్టంట్ వేసేందుకు అయ్యే ఖర్చు ఒకటిన్నర నుంచి రెండు లక్షల రూపాయలు" అని డా.ప్రవీణ్ చంద్ర వివరించారు.
ఇప్పటి వరకు 400మందికి లేజర్ థెరపీ!
Latest Heart Blockage Treatment : గత ఏడాది కాలంలో మేదాంత ఆసుపత్రిలో 300 నుంచి 400 మంది రోగులు లేజర్ థెరపీతో చికిత్స పొందారని డాక్టర్ ప్రవీణ్ చంద్ర తెలిపారు. ఈ థెరపీ వల్ల రోగి ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారని చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన రోజే చికిత్స పూర్తయి పేషెంట్ డిశ్చార్జ్ అవుతారని వెల్లడించారు. స్టంట్ వేస్తే డిశ్చార్జి అవ్వడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని చెప్పారు.