CPR Process In Telugu : హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు చాలా మందికి ఏం చేయాలో పాలుపోదు. కొందరు తెలియక బాధితుడికి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఇలా చేయకూడదు. ఎందుకంటే, పేషెంట్ కాన్షియస్‌లో లేనప్పుడు నీళ్లు తాగిస్తే ఆ నీళ్లు నేరుగా లంగ్స్‌లోకి వెళ్లపోయి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఎవరైనా గుండె పోటుకు గురైనప్పుడు వెంటనే వారికి సీపీఆర్ చేయాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అంబులెన్స్‌ను కూడా పిలవాలి. వీలైనంత వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
సీపీఆర్ ఎలా చేయాలి?
How To Do CPR Step By Step : కార్డియో పల్మరీ రిసస్కిటేషన్నే సీపీఆర్ అని అంటారు. ఈ సీపీఆర్ ప్రాసెస్ ఎలా చేయాలంటే?
స్టెప్ 1: పేషెంట్‌ను ముందుగా చదునైన ప్రాంతంలో వెల్లకిలా పడుకోబెట్టాలి. అతనిలో ఎలాంటి కదలిక లేకపోతే.. వెంటనే పల్స్ చూడాలి. వాస్తవానికి మేజర్ హార్ట్ ఎటాక్ అయితే పల్స్ దొరకదు. కాబట్టి మెడ వద్ద పల్స్ చూడాలి. ఒక వేళ అక్కడ కూడా పల్స్ దొరకలేదంటే హార్ట్ ఆగిపోయినట్లు గుర్తించాలి.
స్టెప్ 2 : హార్డ్ ఆగిపోయినట్లు గుర్తించిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సీపీఆర్ చేయాలి. మీ చేతితో పేషెంట్ ఛాతీ (గుండె మీద కాదు) మధ్య భాగంలో ప్రెస్ చేయాలి. ఇలా చేసేటప్పుడు మీ చేతులు బెండ్ కాకుండా స్ట్రైట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఛాతీని కనీసం 5 సెంటీమీటర్లు లోతుకు వెళ్లేలా నొక్కాలి. నిమిషానికి కనీసం 80 నుంచి 100 సార్లు ఇలా ప్రెస్ చేస్తుండాలి.
స్టెప్ 3 : ఇలా ఒక నిమిషం చేశాక, పల్స్ చెక్ చేయాలి. పల్స్ దొరకకపోతే పేషెంట్ ముక్కు మూసి, అతని నోటిలోకి మీ నోటితో ఆక్సిజన్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. తరువాత మళ్లీ సీపీఆర్ చేయాలి. ఇలా 20 నిమిషాల పాటు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే పేషెంట్ గుండె కొట్టుకునే అవకాశం ఉంటుంది.
వాస్తవానికి హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా ఈ సీపీఆర్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మరీ ఆలస్యం చేస్తే లాభం ఉండకపోవచ్చు. ఒకరు పేషెంట్‌కు సీపీఆర్ చేస్తుంటే చుట్టూ ఉండేవాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా 108కుగానీ, అంబులెన్స్‌కు గానీ ఫోన్ చేయాలి. వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
నోట్ : నేటి కాలం ప్రతి ఒక్కరూ కచ్చితంగా సీపీఆర్ ప్రాసెస్ నేర్చుకోవాలి. దీని వల్ల ఆపత్కాలంలో మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు.