Causes Of Sudden Weight Gain Women : బరువు పెరగడానికి ఎక్కువ శాతం.. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడమే కారణమవుతాయి. కానీ.. ఇవి సరిగా ఉన్నప్పటికీ మహిళలు బరువు పెరుగుతున్నారంటే.. దానికి కారణాలు వేరే ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు. మరి, అవేంటి..? బరువు తగ్గడానికి ఏం చేయాలి? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
పీసీఓఎస్ :
హార్మోన్ల అసమతుల్యత వల్ల పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వేధిస్తుంది. ఇది శరీరాన్ని ఎన్నో అనారోగ్యాలకు గురిచేస్తుందని నిపుణులు అంటున్నారు. దేశంలో.. పీసీఓఎస్‌తో బాధపడే మహిళల సంఖ్య ఏటా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శరీరంలో ఆండ్రోజెన్ లేదా టెస్టోస్టిరాన్ వంటి పురుష హార్మోన్లు అధికంగా ఉత్పత్తవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇది క్రమంగా పీసీఓఎస్‌కి దారితీస్తుందని, దీనివల్ల బరువు పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, మొటిమలు, జుట్టు రాలడం, అవాంఛిత రోమాల సమస్య ఎక్కువవడం, మూడ్ స్వింగ్స్ వంటి చాలా సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. అయితే.. మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా.. సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా.. ఈ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు. ఇలా చేస్తే పెరిగిన బరువు కూడా తగ్గించుకోవచ్చని అంటున్నారు.
చపాతీలు మృదువుగా రావాలా? - పిండిలో ఇవి కలిపితే చాలు - భలే స్మూత్‌గా వస్తాయి!
ఒత్తిడి :
ఉద్యోగంలో పని ఒత్తిడి, కుటుంబంలో సమస్యల వల్ల కొంత మంది ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ సమయంలో కాస్త నిద్రపోతే సర్దుకుంటుందిలే అని చాలా మంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ, కొన్నిసార్లు ఈ ఒత్తిడి తీవ్ర సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు. ఇలాంటప్పుడు ఉత్పత్తయ్యే కార్టిసాల్ హార్మోన్ ఆకలిని పెంచుతుంది. తీపి, అధిక కొవ్వులుండే ఆహారం తినేలా మెదడును ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. నిద్రలేమి, జీర్ణప్రక్రియ మందగించడం వంటివన్నీ కూడా అధిక బరువుకు కారణమవుతాయట. అలసిపోయిన శరీరం తనంతట తానుగా మరమ్మతు చేసుకోవడానికి నిద్ర ఎంతగానో ఉపకరిస్తుంది. తరచూ నిద్రకు తగినంత సమయం కేటాయించక పోవడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
నీటి శాతం తగ్గినప్పుడు :
డీహైడ్రేషన్ సమస్య తలెత్తినప్పుడు అలసటగా అనిపిస్తుంది. దాన్ని గ్రహించలేక మన శరీరం ఆకలిగా ఉందని అనుకుంటారు! దీంతో ఏది పడితే అది తినడం వల్ల కూడా ఎక్కువగా బరువు పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఒత్తిడిని తగ్గించే మందులు, గర్భ నిరోధక మాత్రలు కూడా కొంతమందిలో శరీర బరువు పెరగడానికి దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు.
వయసు 40 దాటిందా? - ఈ 7 టిప్స్‌తో యంగ్‌గా కనిపించండి!
హైపో థైరాయిడిజం :
థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను విడుదల చేయకపోవడం వల్ల కూడా బరువు పెరుగుతారట. మెనోపాజ్ దశకు చేరినా బరువు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈస్ట్రోజన్ స్థాయులు తగ్గడం, హార్మోన్లలో అసమతుల్యత వంటివి కూడా ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.