ETV Bharat / sukhibhava

క్యాన్సర్‌పై బ్రహ్మాస్త్రం.. రోగనిరోధకతతో మహమ్మారికి చెక్​! - క్యాన్సర్ రకాలు

మనలో క్యాన్సర్‌ను ఎదుర్కొనే రోగనిరోధకత ఉంటుందంటే ఒకప్పుడు నమ్మేవారే కాదు. ఇప్పుడదే క్యాన్సర్‌ చికిత్సలో ప్రధాన అస్త్రంగా మారుతోంది. నియంత్రణ అన్నదే లేకుండా ఇబ్బడి ముబ్బడిగా వృద్ధిచెందే కణాలను రోగనిరోధక వ్యవస్థ ఎదుర్కొంటుందని నిరూపణ కావటం.. వీటి పనిపట్టే రోగనిరోధక కణాలను స్పష్టంగా గుర్తించటం వినూత్న పద్ధతికి బీజం వేసింది. అదే రోగనిరోధక చికిత్స (ఇమ్యునోథెరపీ). మనలోని రోగనిరోధక వ్యవస్థను క్యాన్సర్‌ కణాలపై దాడిచేసేలా పురికొల్పే దీన్ని ఇప్పటికే వాడుకుంటున్నాం. కొత్తగా కార్‌-టి సెల్‌ థెరపీ మరిన్ని ఆశలు కల్పిస్తోంది. తెల్ల రక్తకణాల్లో భాగమైన టి కణాలకు క్యాన్సర్‌ను గుర్తించే సామర్థ్యాన్ని కల్పించటం దీనిలోని కీలకాంశం. రోగనిరోధక వ్యవస్థ కన్నుగప్పి సంచరించే క్యాన్సర్‌ కణాలను మట్టుబెట్టే శక్తిని తిరిగి నేర్పించే ఇది బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుండటం విశేషం.

cancer immunotherapy
cancer immunotherapy
author img

By

Published : Nov 1, 2022, 11:03 AM IST

క్యాన్సర్‌ చికిత్స అనగానే కీమోథెరపీ, రేడియేషన్‌, సర్జరీలే గుర్తుకొస్తాయి. ఇప్పటికీ ఇవే ప్రధాన చికిత్సలు కూడా. ఇవే కాదు.. గత దశాబ్దంలో పురుడు పోసుకున్న ఇమ్యునోథెరపీ సైతం ఎంతగానో తోడ్పడుతోంది. రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతూ వినూత్నంగా రూపొందుతోంది. ఇంతకీ రోగనిరోధక చికిత్స అంటే? మన ఒంట్లోకి హానికారక సూక్ష్మక్రిములు ప్రవేశించినప్పుడో, లేదూ టీకాలు తీసుకున్నప్పుడో శరీరం వాటికి సంబంధించిన రోగనిరోధకత శక్తిని సంతరించుకొని పెట్టుకుంటుంది. మళ్లీ ఎప్పుడైనా ఆ సూక్ష్మక్రిములు దాడిచేసినప్పుడు వాటిని ఎదుర్కొంటుంది. జబ్బులు కలగజేయకుండా చూస్తుంది. స్థూలంగా చెప్పాలంటే ఇదే ఇమ్యునోథెరపీ. క్యాన్సర్‌ చికిత్సలోనూ దీన్ని వాడుకోవాలని చాలాకాలంగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఎందుకంటే క్యాన్సర్‌ ఒకరకంగా లోపభూయిష్ట రోగనిరోధక వ్యవస్థ ఫలితమే! సాధారణంగా మన రోగనిరోధక వ్యవస్థ ఎప్పటికప్పుడు అసాధారణ కణాలను గుర్తించి, నిర్మూలిస్తుంటుంది. ఇలా కణాలు ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందకుండా, క్యాన్సర్‌గా మారకుండా ఎప్పటికప్పుడు నిలువరిస్తుంది. కణితి ఏర్పడినా దాంతో పోరాడుతూ వస్తుంది. కొందరిలో కణితుల లోపల, చుట్టుపక్కల రోగనిరోధక కణాలు ఉంటుండటమే దీనికి నిదర్శనం. వీటినే ట్యూమర్‌ ఇన్‌ఫిల్‌ట్రేటింగ్‌ లింఫోసైట్లు (టీఐఎల్‌) అంటారు. కణితికి రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందిస్తోందనటానికి వీటి ఉనికి ఒక సంకేతం. ఇలాంటి కణాలతో కూడిన కణితులు గలవారు క్యాన్సర్‌ నుంచి బాగా కోలుకుంటుంటారు కూడా. క్యాన్సర్‌ చికిత్సలో రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించు కోవటానికి ఇలాంటి విషయాలే దారిచూపాయి.

ప్రయోగాలు దాటుకొని..
కొన్ని రకాల బ్యాక్టీరియా భాగాలను రక్తంలోకి ఎక్కించినప్పుడు వీటిని ఎదుర్కోవటానికి పుట్టుకొచ్చిన రోగనిరోధక సామర్థ్యం క్యాన్సర్‌ కణాలను చంపటానికీ ఉపయోగపడుతున్నట్టు చాలాకాలం క్రితమే బయటపడింది. బాగా ముదిరిపోయిన క్యాన్సర్లలో సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా అంశాలను ఇంజెక్షన్‌ ద్వారా ఎక్కించినప్పుడు ఇలాంటి ఫలితమే కనిపిస్తున్నట్టు ఏనాడో గుర్తించారు. అలాగే డిఫ్తీరియా విషతుల్యాలను సంగ్రహించి, వాటిని నిర్వీర్యం చేసి శరీరంలోకి ఎక్కించీ పరీక్షించారు. అన్నింటికన్నా ముఖ్యమైంది బీసీజీ టీకా ప్రయోగం. క్యాన్సర్‌ చికిత్సలో టీకాలను వాడుకోవటం దీంతోనే మొదలైంది. మూత్రాశయ క్యాన్సర్‌ గలవారికి బీసీజీ టీకాను పెద్ద మొత్తంలో సెలైన్‌ ద్రావణంలో కలిపి, మూత్రాశయంలోకి నేరుగా ఇస్తే పైపొరల్లో ఏర్పడే కణితులు గణనీయంగా తగ్గుతుండటం గమనార్హం. పది, పదిహేను ఏళ్లుగా దీన్ని విస్తృతంగానూ వాడుతున్నారు.

టి కణాలు ప్రధానం
తెల్ల రక్తకణాల్లో న్యూట్రోఫిల్స్‌, ఈస్నోఫిల్స్‌, బేసోఫిల్స్‌, మోనోసైట్స్‌, లింఫోసైట్స్‌ వంటి రకరకాల కణాలుంటాయి. లింఫోసైట్స్‌లో టి, బి అని మళ్లీ రెండు రకాలు. వీటిల్లో టి కణాలు కీలకం. ఇవి క్యాన్సర్‌ నిర్మూలనకు తోడ్పడతాయి. మన శరీరంలో సహజంగానే తెల్ల రక్తకణాలుంటాయి కదా. అవెందుకు క్యాన్సర్‌ కణాలను గుర్తించి, చంపటం లేదు? దీనికి కారణం క్యాన్సర్‌ మాయోపాయమే. ఇది మన రోగనిరోధక వ్యవస్థను ఏమార్చి, తనను క్యాన్సర్‌గా గుర్తించనీయని స్థితిని (ఎనర్జీ) సృష్టించుకుంటుంది. దీన్ని సమ్మోహనాస్త్రంతో పోల్చుకోవచ్చు. ఇది లింఫోసైట్స్‌ను నిద్రాణ స్థితిలోకి నెట్టేస్తుంది మరి. ఫలితంగా వ్యాధికారకాలకు సంబంధించిన గ్రాహకాల ద్వారా వచ్చే ప్రేరణలకు ప్రతిస్పందించవు. క్యాన్సర్‌ కణాలూ మామూలు కణాలేనని భ్రమించేలా చేస్తుంది. దీంతో లింఫోసైట్లు క్యాన్సర్‌ను గుర్తించటం మరచిపోతాయి. ఇమ్యునోథెరపీ చేసే పని దీన్ని గుర్తు చేయటమే.

.

చికిత్సలు రకరకాలు
ఇమ్యూన్‌ చెక్‌పాయింట్‌ ఇన్‌హిబిటార్లు: మన రోగనిరోధక వ్యవస్థలో తనిఖీ చేసే చెక్‌పాయింట్‌ ప్రొటీన్లూ ఉంటాయి. ఇవి రోగనిరోధకత మరీ ఎక్కువగా ప్రతిస్పందించకుండా చూస్తాయి. ఇలా ఆరోగ్యకరమైన కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. వీటి సాయంతోనే క్యాన్సర్‌ కణాలు తప్పించుకుంటాయి. కణితి కణాల మీద పోగ్రామ్డ్‌ డెత్‌-లైగండ్‌ 1 (పీడీ-ఎల్‌1).. టి కణాల మీద ప్రోగామ్డ్‌ సెల్‌ డెత్‌ 1 (పీడీ-1) ప్రొటీన్లు ఉంటాయి. పీడీ-1కు పీడీ-ఎల్‌1 అంటుకుపోతే టి కణాలు కణితుల మీద దాడి చేయవు. ఇమ్యూన్‌ చెక్‌పాయింట్‌ ఇన్‌హిబిటార్‌ రకం మందులు వీటిని అంటుకోకుండా చేస్తాయి. అప్పుడు టి కణాలు క్యాన్సర్‌ కణాల మీద దాడిచేసి, నిర్మూలిస్తాయి. ఇవి మెలనోమా, హాడ్జికిన్స్‌ లింఫోమా, పిల్లల్లో వచ్చే లింఫోమా, ఎక్యూట్‌ లింఫోబ్లాస్టిక్‌ ల్యుకీమియా, ఎక్యూట్‌ మైలాయిడ్‌ లుకీమియా వంటి క్యాన్సర్లలో బాగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఊపిరితిత్తులు, పెద్దపేగు, జీర్ణాశయ క్యాన్సర్‌లో వాడుకుంటున్నారు. కీమోథెరపీ వంటి చికిత్సలు పనిచేయని సందర్భాల్లోనూ ఇవి మంచి ఫలితం చూపిస్తాయి. అయితే ఖరీదు ఎక్కువ కావటం వల్ల అంతగా వాడకంలోకి రావటం లేదు.

  • నోటి, గొంతు క్యాన్సర్లకు అతి తక్కువ మోతాదు కీమోథెరపీతో పాటు చెక్‌పాయింట్‌ ఇన్‌హిబిటార్స్‌ ఇస్తే చక్కగా పనిచేస్తున్నట్టు ఇటీవల టాటా మెమోరియల్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి పరిశోధనలో తేలటం విశేషం.

మోనోక్లోనల్‌ యాంటీబాడీలు: ఇవి ప్రయోగశాలలో వృద్ధి చేసిన రోగ నిరోధక ప్రొటీన్లు. వీటిని థెరపాటిక్‌ యాంటీబాడీలనీ అంటారు. ఆయా క్యాన్సర్ల మీద అంటుకుపోయేలా వీటిని తయారుచేస్తారు. దీంతో రోగనిరోధక వ్యవస్థ కణితులను తేలికగా గుర్తించి, దాడి చేస్తుంది.

చికిత్స టీకాలు: ఇది క్యాన్సర్‌ను ఎదుర్కోవటానికి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసే ప్రత్యేకమైన టీకా చికిత్స పద్ధతి. ఇవి క్యాన్సర్‌ను నివారించే టీకాల వంటివి కావు. అప్పటికే క్యాన్సర్‌ బారినపడ్డవారి కోసం ఉద్దేశించిన టీకాలు. ఇవి క్యాన్సర్‌ కణాల మీదే పనిచేస్తాయి గానీ క్యాన్సర్‌ కారకాలపై ప్రభావం చూపవు. క్యాన్సర్‌ కణాల్లో కణితి సంబంధ యాంటీజెన్లుంటాయి. ఇవి మామూలు కణాల్లో ఉండవు. ఒకవేళ ఉన్నా తక్కువ మోతాదులోనే ఉంటాయి. చికిత్స టీకాలు ఈ యాంటీజెన్లకు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందించేలా తర్ఫీదు ఇస్తాయి. ఇలా క్యాన్సర్‌ కణాలను గుర్తించి, నిర్మూలించేలా చేస్తాయి. అయితే క్యాన్సర్‌ వచ్చినవారిలో టీకాలతో జబ్బుని నయం చేయటం ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది. ప్రస్తుతానికి వైరస్‌ మూలంగా వచ్చే రెండు రకాల క్యాన్సర్లకు నివారణ టీకాలు అందుబాటులో ఉన్నాయి. హెపటైటిస్‌ బి ద్వారా వచ్చే కాలేయ క్యాన్సర్‌, హెచ్‌పీవీ వైరస్‌తో తలెత్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లను టీకాలతో నిరోధించొచ్చు. నిజానికి హెచ్‌పీవీ టీకా దాదాపు 9 రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. దీన్ని ఆడ పిల్లలకు, మగ పిల్లలకు ఇద్దరికీ ఇవ్వచ్చు.

ప్రత్యేకం కార్‌-టి కణ చికిత్స
ఇది సొంత రోగనిరోధక కణాలు మరింత సమర్థంగా క్యాన్సర్‌ మీద దాడి చేయటానికి తోడ్పడే చికిత్స. ఇందులో ట్యూమర్‌-ఇన్‌ఫిల్‌ట్రేటింగ్‌ లింఫోసైట్స్‌ (టీఐఎల్‌) థెరపీ, కార్‌-టి సెల్‌ థెరపీ అని రెండు రకాలున్నాయి. వీటిల్లో కార్‌-టి చికిత్స బాగా ప్రాచుర్యం పొందుతోంది. రోగనిరోధక వ్యవస్థ కంట పడకుండా తప్పించుకోవటానికి క్యాన్సర్‌ కణాలు సృష్టించుకునే స్థితి (ఇమ్యునో పెరసిస్‌) నుంచి తెల్ల రక్తకణాలను బయటపడేయాలంటే వాటిని తిరిగి క్యాన్సర్‌ కణాలను గుర్తించేలా చేయాల్సి ఉంటుంది. కార్‌-టి చికిత్సలో ఇదే ప్రధానం.

ఎలా చేస్తారు?: ముందుగా క్యాన్సర్‌ బాధితుల రక్తాన్ని సంగ్రహిస్తారు. తర్వాత టి కణాలను వేరు చేస్తారు. కొన్ని కణాలను ఎంచుకొని.. చిమెరిక్‌ యాంటీజెన్‌ రిసెప్టర్‌(కార్‌)ను ఉత్పత్తి చేసే జన్యువును జొప్పిస్తారు. తర్వాత ఆయా క్యాన్సర్‌ కణాల గోఢ భాగాలతో (రిసెప్టర్లు) కూడిన ప్రత్యేక ద్రావణం గల చిన్న ఫ్లాస్కులో వేస్తారు. ‘నువ్వు చేయాల్సిన పని క్యాన్సర్‌ కణాలను గుర్తించటం’ అనేలా తర్ఫీదు ఇస్తారు. దీంతో కణాలు జన్యుపరంగా మార్పు చెందుతాయి. దీన్ని స్థిరంగా తన జన్యువులో నిక్షిప్తం చేసుకుంటాయి. కొత్త జవసత్వాలను సంతరించుకుంటాయి. ఇమ్యునో పెరెసిస్‌ను అధిగమించే శక్తిని పొంది, క్యాన్సర్‌ కణాలను తేలికగా గుర్తించే స్థితికి చేరుకుంటాయి. తర్వాతి దశ- మార్పు చెందిన కణాలను పెద్దఎత్తున వృద్ధి చేయటం. ఒకరకంగా దీన్ని క్యాన్సర్‌ను ఎదుర్కొనే సైన్యాన్ని తయారుచేసే ప్రక్రియని చెప్పుకోవచ్చు. ఇందుకు రెండు, మూడు వారాలు పడుతుంది. కొత్తగా వృద్ధి చెందిన కణాలన్నింటికీ క్యాన్సర్‌ కణాలను గుర్తించి, నిర్మూలించే గుణం అబ్బుతుంది. అనంతరం వీటిని సెలైన్‌ ద్రావణంలో కలిపి, రక్తం ద్వారా క్యాన్సర్‌ బాధితుల శరీరంలోకి ప్రవేశ పెడతారు. అప్పుడవి క్యాన్సర్‌ కణాలను గుర్తించి, మింగేయటం ఆరంభిస్తాయి. క్యాన్సర్‌ నయమవుతుంది. ఈ సామర్థ్యం అక్కడితోనే ఆగిపోయేది కాకపోవటం గమనార్హం. క్యాన్సర్‌ను గుర్తించి, నిర్మూలించే గుణం వీటికి జీవితాంతం అలాగే ఉంటుంది. అందువల్ల ఇవి మనగలిగినంత కాలం ఆ రకం క్యాన్సర్‌ మళ్లీ రాదు. క్యాన్సర్‌ బాధితుల శరీరం నుంచి తీసిన తెల్ల రక్తకణాలే కావటం వల్ల శరీరం వీటిని తిరస్కరించే అవకాశం లేదు.

  • ఆయా వ్యక్తులకు, వారికి గల క్యాన్సర్‌ను ఎదుర్కొనేలా ప్రయోగశాలలో కార్‌-టి కణాలను తీర్చిదిద్దుతారు. కాబట్టి ఇవి వారికే, ఆ క్యాన్సర్లకు మాత్రమే ఉపయోగపడతాయి. వేరేవారికి ఇస్తే విచక్షణ లేకుండా అన్ని కణాలను చంపేస్తాయి. ప్రస్తుతం కార్‌-టి కణాలు వేరేవారికీ ఉపయోగపడేలా తీర్చిదిద్దటం మీదా దృష్టి సారించారు. ఇదింకా ప్రయోగదశలో ఉంది. ఇది అందుబాటులోకి వస్తే ఇతరత్రా మందుల మాదిరిగానే అందరికీ ఒకేరకం చికిత్స చేయొచ్చు.

దుష్ప్రభావాలుంటాయా?
కార్‌-టి చికిత్స ఒంట్లోని క్యాన్సర్‌ కణాలను విచ్చలవిడిగా చంపేయటం మొదలెడుతుంది. ఒకవేళ క్యాన్సర్‌ ఒళ్లంతా విస్తరించి ఉంటే లోపలంతా ‘యుద్ధం’ సాగుతూనే ఉంటుంది. చనిపోయిన క్యాన్సర్‌ కణాలను తీసుకెళ్లటానికి ఇతర కణాలు అక్కడికి వస్తాయి. బోలెడన్ని రసాయనాలు విడుదలవుతాయి. ఇది సైటోకైన్‌ ఉప్పెనకు దారితీయొచ్చు. ఫలితంగా జ్వరం, ఒళ్లునొప్పులు, ఆయాసం వంటి దుష్ప్రభావాలు తలెత్తొచ్చు. అయితే వీటిని అధిగమించే అవకాశం లేకపోలేదు. రోగనిరోధకశక్తి గతి తప్పకుండా చూసే స్టిరాయిడ్లు, టి సెల్‌ మాడిఫయర్ల వంటి మందులతో దుష్ప్రభావాల తీవ్రత తగ్గేలా చేయొచ్చు.

ఎవరికైనా ఇవ్వచ్చు గానీ..
కార్‌-టి చికిత్సను ఇటీవల మనదేశంలోనూ చేయటం ఆరంభించారు. దీన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. చెక్‌పాయింట్‌ ఇన్‌హిబిటార్‌ పనిచేయని సందర్భాల్లోనూ బాగా పనిచేస్తుంది. లుకీమియా, లింఫోమా, మల్టిపుల్‌ మైలోమా, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, పెద్దపేగు క్యాన్సర్‌.. ఇలా రకరకాల క్యాన్సర్లలో ఉపయోగపడుతుంది. కీమోథెరపీ, రేడియేషన్‌ వంటి సంప్రదాయ చికిత్సలేవీ లేకుండా ఒక్క దీంతోనే క్యాన్సర్‌ను నయం చేసే అవకాశమూ లేకపోలేదు. కాకపోతే ఖరీదు ఎక్కువ. దీంతో పోలిస్తే కీమోథెరపీ, రేడియేషన్‌, సర్జరీలకు అయ్యే ఖర్చు తక్కువ. అందువల్ల ఎక్కువమందికి వీటినే సూచిస్తున్నారు. కీమోథెరపీ, రేడియేషన్‌ ఇచ్చిన తర్వాత క్యాన్సర్‌ తిరగబెట్టినవారికి.. లేదూ చికిత్సలకు లొంగని క్యాన్సర్లకు మాత్రమే కార్‌ టి సెల్‌ చికిత్సను ప్రయత్నిస్తున్నారు. దీని తయారీకి పెద్దఎత్తున ప్రయోగశాలలు నెలకొల్పి, వైద్య, విజ్ఞాన సంస్థల సమన్వయంతో కృషి చేస్తే మున్ముందు చవకగా అందుబాటులోకి రావొచ్చు. అప్పుడిది క్యాన్సర్‌ ప్రధాన చికిత్సలో భాగమైనా ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇవీ చదవండి: తరచూ తలనొప్పి వస్తుందా..? అయితే ప్రమాదమే!

మాయిశ్చరైజర్​తో చర్మం జిడ్డుగా మారుతోందా?.. ఈ నిపుణుల సలహాలు మీకోసమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.