Ayurvedic Remedies For Acidity : ఎసిడిటీ బాధ వర్ణనాతీతం. అనుభవించిన వారికే దాని తీవ్రత తెలుస్తుంది. తిన్నా సమస్యే.. తినకపోయినా సమస్యే. పదే పదే పుల్లటి తేన్పులు.. పొట్టలోని ఆమ్లాలు గొంతులోకి వస్తూ తీవ్రంగా వేధిస్తుంది. ఈ సమస్యతో కొందరు 5.. 10.. 15 అంటూ సంవత్సరాలపాటు బాధపడుతూనే ఉంటారు. ఇదే పరిస్థితి కొనసాగితే క్యాన్సర్‌గా కూడా మారే ఛాన్స్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. జాగ్రత్త తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కేవలం ఇంట్లోని పదార్థాలతో దీన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.
ఉసిరి : ఎసిడిటీతో బాధపడే వారికి ఇది చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ప్రతిరోజూ భోజనం చేసే ముందు ఉసిరి పౌడర్‌ను గోరు వెచ్చని నీటిలో కలిపి టీ లాగా తీసుకోవాలి. దీనివల్ల కడుపులో PH స్థాయిలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు. 2011లో యునైటెడ్ స్టేట్స్‌లోని యునివర్శిటీ ఆఫ్ ఫిలాడెల్ఫియాలో ఉసిరి టీపై పరిశోధనలు నిర్వహించారు. ఎసిడిటీతో బాధపడేవారికి ఉసిరి టీని రోజుకు రెండుసార్లు 120 మందికి అందించారు. ఆరు వారాల తరవాత వీరిలో ఎసిడిటీ లక్షణాలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడైందట.
సోంపు గింజలు : ఎసిడిటీ సమస్యను తగ్గించడానికి సోంపు గింజలు కూడా ఉపయోగపడతాయి. ఎసిడిటీ, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు భోజనం చేసిన తర్వాత కొద్దిగా సోంపు గింజలను నోట్లో వేసుకుని నమలాలి. అలాగే సోంపు గింజలతో టీ చేసుకుని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అల్లం : అల్లంలోని యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఎసిడిటీని తగ్గించడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే జింజెరల్ అనే పదార్థం ఆమ్ల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు తాజా అల్లం ముక్కలను నీటిలో ఉడకబెట్టి, భోజనానికి ముందు లేదా తర్వాత టీ లాగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల ఛాతీ భాగంలో వచ్చే మంట, ఎసిడిటీ తగ్గుతాయని అంటున్నారు. ఇలా రోజు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. ఎసిడిటీని తగ్గించడంలో అల్లం ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని 2017లో కాంప్లిమెంటరీ థెరపీస్ ఇన్ మెడిసిన్ జర్నల్ ప్రచురించింది.
ఏళ్లనాటి మైగ్రేన్ బాధలు - ఇలా తిండితోనే తగ్గించుకోవచ్చు!
తులసి : ఎసిడిటీని తగ్గించడంలో తులసి కూడా ఉపయోగపడతుంది. తాజా తులసి ఆకులను నమలడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. ఐదు తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆకులు తినాలి. అలాగే నీటిని కూడా తాగాలి. ఇలా చేయడం వల్ల ఎసిడిటీని దూరం చేసుకోవచ్చట. ఎండిన తులసి ఆకులను పొడి చేసి.. టీ లాగా కూడా తీసుకోవచ్చని చెబుతున్నారు.
ఇవి ముఖ్యం : పైవాటితోపాటుగా మరికొన్ని పాటించాలని సూచిస్తున్నారు. వేళకు భోజనం చేయాలని చెబుతున్నారు. కారం మసాలాలు ఎక్కువగా ఉండే జంక్‌ఫుడ్ తీసుకోవద్దని.. కూల్ డ్రింక్స్, కాఫీటీలు ఎక్కువగా తీసుకోద్దని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల కూడా ఎసిడిటీ తీవ్రమవుతుందని హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి మందులూ వాడకుండానే - హైబీపీ తగ్గించుకోండిలా!
మునగ ఆకుతో 300 వ్యాధులకు చెక్ - ఈ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!