Driver Dastagiri: వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా ఉన్న డ్రైవర్ దస్తగిరి మరోసారి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సాయంత్రం పులివెందుల నుంచి కడపకు వచ్చిన దస్తగిరి.. ముందుగా సీబీఐ అధికారులను కలిసి తనకు ఎదురవుతున్న ముప్పును వివరించారు. అనంతరం కడప ఎస్పీ కార్యాలయానికి వెళ్లి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. వారం రోజుల కిందట తన ఇంటి పెంపుడు కుక్క చనిపోయిందని.. వాటిలో ఏదైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానాలను దస్తగిరి వ్యక్తం చేశారు. ఈనెల 2వ తేదీన తన ఇంటి పెంపుడు కుక్క చనిపోయిందని.. 6వ తేదీన గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో తన ఇంటికి వద్దకు వచ్చి.. కుక్కను కొంటామని అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము ఇంటివద్ద లేని సమయం చూసి.. కుక్కను అడిగి వెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుక్క చనిపోవడం, ఆరుగురు వ్యక్తులు ఇంటికి రావడం చూస్తే ఏదో అనుమానం కల్గుతోందని.. వాటిపై విచారణ చేయాలని కోరుతూ జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు దస్తగిరి ఫిర్యాదు చేశారు.
రెండు రోజుల కిందటే తన గన్మెన్ల మార్పు అంశంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కడప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు అందజేసిన దస్తగిరి.. ఇపుడు మళ్లీ మరో ఫిర్యాదు అందజేయడం చర్చనీయాంశమైంది. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ కడపలోని సీబీఐ అధికారులకు కూడా లేఖ అందజేశారు. సీబీఐ అధికారులతో ఇంకా చాలా విషయాలను దస్తగిరి వివరించినట్లు తెలిసింది. అనంతరం కడప నుంచి పులివెందుల వెళ్లిపోయారు.
ఇవీ చదవండి: