కడప వైఎస్ కుటుంబానికి ఇంటితో సమానం. రాజశేఖర్ రెడ్డి ఉన్నంతకాలం ఆ రాజసాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత ఆయన వారసుడిగా అరంగేట్రం చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా దీనిని కాపాడుకుంటూ వచ్చాడు. గత ఎన్నికల్లోనూ ఇక్కడ వైకాపా హవా కొనసాగింది. అయితే.. అప్పుడు ఒక్క రాజంపేటను మాత్రం తెదేపా గెలుచుకో గలిగింది.
ఆ ఒక్కరూ వైకాపా గూటికి...
2014 అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లాలో తొమ్మిది స్థానాల్లో వైకాపా విజయం సాధించింది. రాజంపేట నుంచి మేడా మల్లికార్జున రెడ్డి తెదేపా అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత పరిణామాలతో 2018లో ఆయన వైకాపాలో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. దీంతో చివరి నిమిషంలో తెదేపా ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. ఆయనను బుజ్జగించారు. అంతా సద్దుమణిగడంతో మేడా ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును అదేరోజు సాయంత్రం కలిశారు. ఇంతటితో ఈ కథకు తెరపడింది అనుకున్నారంతా... కానీ అనూహ్యంగా ఆయనే ఈసారి వైకాపా అభ్యర్థిగా రాజంపేట నుంచే బరిలో నిలిచి విజయం సాధించారు.
జగన్మోహన్ రెడ్డికి భారీ మెజారిటీ...
వైకాపా కంచుకోట కడపలో పది స్థానాల్లోనూ విజయం సాధించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ పులివెందుల నుంచి బరిలో నిలిచారు. తెదేపా అభ్యర్థి వెంకట సతీశ్‌రెడ్డి సతీశ్ రెడ్డిపై 90,110 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. కడప నుంచి వైకాపా తరఫున బరిలో నిలిచిన అంజద్ పాషా సమీప తెదేపా అభ్యర్థిపై అమీర్‌బాబుపై గెలిచారు. కోడూరులో నర్సింహ యాదవ్(తెదేపా)పై కొరముట్ల శ్రీనివాసులు(వైకాపా), కమలాపురంలో పుత్తా నరసింహారెడ్డి(తెదేపా)పై రవీంద్రనాథ్‌రెడ్డి(వైకాపా), జమ్మలమడుగులో రామసుబ్బయ్య(తెదేపా)పై ఎం.సుధీర్‌రెడ్డి(వైకాపా), రాయచోటిలో రమేశ్ కుమార్ రెడ్డి(తెదేపా)పై గండికోట శ్రీకాంతరెడ్డి(వైకాపా), బద్వేల్లో రాజశేఖర్(తెదేపా)పై జి.వెంకట సుబ్బయ్య(వైకాపా), రాజంపేటలో బత్యాల చెంగల్రాయుడు(తెదేపా)పై మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, ప్రొద్దుటూరులో లింగారెడ్డి(తెదేపా)పై రాచమల్ల శివప్రసాద్‌రెడ్డి(వైకాపా), మైదకూరులో పుట్టా సుధాకర్ యాదవ్(తెదేపా)పై ఎస్. రఘురామిరెడ్డి(వైకాపా) విజయ ఢంగా మోగించారు.
ఇదీ చదవండీ:అన్నీ తానయ్యాడు.. అధికారాన్ని సాధించాడు!