సాధారణంగా ఆలయాల్లో మహిళలు పొంగళ్లు పెట్టి దేవుళ్లకు నైవేద్యం సమర్పిస్తారు. ఇందుకు భిన్నంగా కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయపల్లెలోని సంజీవరాయ(ఆంజనేయ) స్వామి ఆలయంలో మాత్రం పురుషులే పొంగళ్లు పెడుతుంటారు. ఆడవాళ్లు ఈ గుడిలోకి అడుగుపెట్టరు. 1516 సంవత్సరం నుంచి ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతోంది.
పొంగళ్ల పండగ
ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగకు ముందుగా వచ్చే ఆదివారం రోజు సంజీవరాయ స్వామి వారికి పొంగళ్లు సమర్పించే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తారు. ఈ ఆదివారం సైతం ఈ కార్యక్రమాన్ని జరిపారు. పొంగళ్లు తయారు చేయడానికి కావాల్సిన వస్తువులతోపాటు పూజా సామాగ్రిని మగవారే నెత్తిమీద పెట్టుకుని సంప్రదాయ వస్త్రధారణలో ఆలయానికి వచ్చారు. మహిళలు లోపలికి రాకుండా కేవలం బయటి నుంచి స్వామి వారిని దర్శించుకుని హారతి అందుకుంటారు. బాలికలు మాత్రం ఆలయంలోకి వెళ్లొచ్చు. ఈ గ్రామం వారు ఎక్కడ ఉన్నా సంజీవరాయ స్వామి పొంగళ్ల ఉత్సవానికి మాత్రం తప్పక హాజరవుతారట. సంక్రాంతి పండగ కంటే ఈ ఉత్సవాన్నే వైభవంగా చేసుకుంటామని తిప్పాయపల్లె గ్రామస్థులు అంటున్నారు.
- పుల్లంపేట మండల కేంద్రం నుంచి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది తిప్పాయపల్లె. రాజంపేట నుంచి అయితే 9 కిలోమీటర్ల దూరం.
ఇదీ చదవండి: వీడియో: జల్లికట్టులో విషాదం.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు