కడప నగరపాలక కడప నగర జనాభా 1911లో 17,807, 2021 నాటికి 4.17 లక్షలకు చేరినట్లు అంచనా. అంటే గడిచిన 110 ఏళ్లలో 23 రెట్లు పెరిగింది. అప్పుడూ.. ఇప్పుడూ నగర వాసులకు పెన్నానది నుంచే మంచినీటిని సరఫరా చేస్తున్నారు. జనాభా 23 రెట్లు పెరిగినా పెన్నాలో నీటి లభ్యత ఒక్క శాతం కూడా పెరగలేదు. భవిష్యత్తులో పెరిగే అవకాశమూ లేదు. ఏటా జనాభా 3 నుంచి 5 శాతం వరకు పెరగవచ్చునని అంచనా. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా నీటి అవసరాలను ఎలా తీర్చగలరు? పెన్నా నది ఎండుతున్నా నదీ జలాల పరిరక్షణకు, ఆ నీటిని ఒడిసిపట్టుకుని పొదుపుగా వాడుకోవడానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. నగర ప్రజల తాగునీటి అవసరాలు శాశ్వతంగా తీర్చడానికి ప్రతిపాదించిన పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో పదేళ్ల తరువాత అధ్వానంగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిల్వ చేసుకునే వెసులుబాటేది...?
* పెన్నానది జలాలు వచ్చినంత వేగంగా దిగువకు ప్రవహించి సోమశిలకు చేరుతున్నాయి. నదిలో నీరు అందుబాటులో ఉన్నప్పుడు నిల్వ చేసుకోవడానికి కనీసం ఒక జలాశయం కూడా లేదు. పెన్నానది ఎండిపోయినప్పుడు వెలుగోడు జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 180 కిలోమీటర్లు ప్రవహించి వచ్చేసరికి సగం నీరు మాత్రమే లింగంపల్లికి చేరుతోంది. ఏటా రూ.లక్షలు వెచ్చించి లింగంపల్లి వద్ద నీరు కిందకు పోకుండా ఇసుక కట్టలు కడుతున్నారు.
* కడప నగరంలోని అన్ని ప్రాంతాలకు నీటిని సరఫరా చేయాలంటే కీలక ప్రాంతాల్లో ఓవర్‌హెడ్‌ట్యాంకులను నిర్మించాలి. అమృత్ ఫేజ్-1లో నగరంలోని ఆరు వేర్వేరు ప్రాంతాల్లో ట్యాంకులు నిర్మించడానికి రూ.13 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయి. 2015-16లోనే నిధులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు పనులు మాత్రం ప్రారంభించలేదు.
గండికోట జలాశయం నుంచి నీటి తరలింపు
కడప నగరానికి గండికోట జలాశయం నుంచి నీటిని తరలించడానికి ప్రజారోగ్య, సాంకేతికశాఖ ప్రణాళికలు రూపొందించింది. సోమశిల వెనుక జలాల నుంచి కడప నగరానికి ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించాల్సివస్తోంది. లింగంపల్లి వద్ద సబ్‌సర్ఫేస్ డ్యాం నిర్మించినా అక్కడ నుంచి కూడా ఎత్తిపోతల పథకం ద్వారానే నీటిని తరలించాలి. ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తరలించడం ఖర్చుతో కూడుకున్న పని గండికోట జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా విద్యుత్తు వినియోగం లేకుండా కడప నగరానికి నీటిని తరలించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశాం.
-లవన్న, కమిషనర్, నగరపాలక సంస్థ, కడప
మరో ప్రత్యామ్నాయం లేదు...
* కడప నగర ప్రజల తాగునీటి అవసరాలకు పెన్నా నది తప్ప ఇతర ప్రత్యామ్నాయం లేదు. ప్రత్యామ్నాయంగా జలవనరులను అభివృద్ధి చేసే ప్రయత్నమూ జరగడంలేదు. నది ఎండిపోతే కర్నూలు జిల్లా అలగనూరు నుంచి లేదా వెలుగోడు నుంచి నీటిని విడుదల చేయాలని ఉన్నతాధికారులకు లేఖలు రాయడం తప్ప గత 16 ఏళ్లలో రాజకీయ నాయకులు సాధించింది ఏమీ లేదన్న విమర్శలు లేకపోలేదు. ః కడప నగరంలో సగటున ఒక వ్యక్తికి రోజుకు 125 లీటర్ల నీటిని సరఫరా చేయాలంటే కనీసం 51.40 ఎంఎల్‌డీల నీరు అవసరం. 49.92 ఎంఎల్‌డీల నీటిని ప్రతిరోజూ సరఫరా చేస్తున్నట్లు నగరపాలక సంస్థ లెక్కలు వేస్తోంది. పంపిణీలోని లోపాలతో 10 శాతం నీరు వృథా అవుతున్న అంశాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. ః పెన్నానది నుంచి నీటిని తీసుకోవడానికి రెండు ప్రాంతాల్లో వాటర్‌వర్క్స్ ఏర్పాటు చేశారు. గండి వాటర్‌వర్క్స్ నుంచి 12 ఎంఎల్‌డీలు, లింగంపల్లి వాటర్‌వర్క్స్ నుంచి 32 ఎంఎల్‌డీల నీటిని తీసుకుంటున్నారు. ః జూన్ నుంచి ఫిబ్రవరి వరకు నదిలో నీటి ప్రవాహం ఉండాలి. ఇది ఒకప్పటి మాట. గడచిన పదేళ్లలో పరిశీలిస్తే 2020లో మినహా ఈ రెండు వాటర్‌వర్క్స్ పరిధిలో నీటి జాడ లేదు. ఇక్కడున్న బావుల్లో కొన్ని కూలిపోగా, మరికొన్ని బావులు పూడికతో నిండిపోయాయి.
ఇదీ చదవండి: