ప్రభుత్వం సరఫరా చేస్తున్న వేరుశనగ విత్తనాల కోసం తలెత్తిన చిన్న వివాదం చినికి చినికి గాలి వానగా మారి.. ఒకరి ప్రాణాలను హరించింది. ప్రభుత్వం నియమించిన వాలంటీర్ పోకడలతో ఒక రైతు హత్యకు గురైన సంఘటన కడప జిల్లా చిన్నమండెం మండలం పడమటికోన వడ్డేపల్లిలో జరిగింది.
పోలీసులు ఏం చెప్పారంటే....
పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన శంకరయ్య అనే రైతు ప్రభుత్వం ఇచ్చిన రాయితీ విత్తనాలు తెచ్చుకున్నాడు. అదే గ్రామంలోని వాలంటీర్ బంధువులు తాము సిఫార్సు చేస్తేనే కాయలు వచ్చాయని శంకరయ్య వద్ద ప్రస్తావించారు. తనకు ఊరికే రాలేదని డబ్బులు చెల్లిస్తేనే ఇచ్చారని చెప్పడంతో ఇరువురు ఘర్షణకు దిగారు.
ఈ ఘర్షణలో శంకరయ్య సమీప బంధువు రెడ్డయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. అతనిని శంకరయ్య మరి కొంతమంది కలిసి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి శుక్రవారం రాత్రి పదకొండున్నర గంటలకు గ్రామానికి తిరుగు పయనమయ్యారు. అప్పటికే విషయం తెలుసుకొన్న గ్రామ వాలంటీర్ శ్రీనివాసులు మరికొందరితో కలిసి తమ బంధువులపై ఘర్షణకు దిగుతావా అని శంకరయ్యపై కాపు కాసి అతి దారుణంగా హతమార్చాడు.
అడ్డువచ్చిన శంకరయ్య భార్య నీరజతో పాటు మరో ముగ్గురిపై ఎదురుదాడి చేయగా వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తిరుపతికి తరలించగా వారిలో మహేష్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న రాయచోటి గ్రామీణ సీఐ లింగప్ప, ట్రైనీ డీఎస్పీ, చిన్నమండెం పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతుడు శంకరయ్య కు ముగ్గురు కుమార్తెలు ఉండగా ఆయన మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. హత్యకు పాల్పడిన గ్రామ వాలంటీర్ శ్రీనివాసులుతోపాటు మరో 11 మందిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయచోటి గ్రామీణ సీఐ లింగప్ప పేర్కొన్నారు.
ఇదీ చూడండి