7500 Ideal Primary Schools in AP: ఏపీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7 వేల 500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. గత ప్రభుత్వం తెచ్చిన జీఓ 117ను రద్దు చేసి, కొత్త విధానాన్ని తీసుకురానున్నారు. 1 నుంచి 5 తరగతులు ఉండే ఈ పాఠశాలల్లో తరగతికి ఒక టీచర్‌ను కేటాయించనున్నారు. కనీసం 60 మంది విద్యార్థులు ఉండాలనే నిబంధన పెట్టినప్పటికీ 50 మంది ఉన్నా ‘ఆదర్శ బడులు’గా గుర్తించాలని నిర్ణయించారు.
గత ప్రభుత్వంలో ప్రైమరీ స్కూల్స్ నుంచి 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించారు. ఈ తరగతులను వెనక్కి తీసుకొచ్చి తల్లిదండ్రుల కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాల మేరకు ప్రాథమిక బడుల్లోనే మళ్లీ విలీనం చేస్తారు. స్కూల్స్ మధ్య దూరం ఎక్కువగా ఉంటే బేసిక్ ప్రైమరీ స్కూళ్లను కొనసాగిస్తారు. ఇక్కడ 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. ఈ స్కూల్స్‌లో విద్యార్థుల ఆధారంగా టీచర్లను కేటాయిస్తారు. జీఓ 117ని రద్దు చేసిన తర్వాత తీసుకురాబోయే సంస్కరణలపై ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. పురపాలికల్లో వార్డుని యూనిట్‌గా తీసుకొని ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు.
విద్యాశాఖలో సంస్కరణలకు సిద్ధమైన లోకేశ్ - రాబోయే ఆరు నెలల్లో అనేక మార్పులు
12 వేలకుపైగా సింగిల్ టీచర్ పాఠశాలలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, గత ప్రభుత్వంలో 3, 4, 5 తరగతులను ‘ఉన్నత’ పాఠశాలలకు తరలించడంతో సింగిల్ టీచర్ పాఠశాలల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో 12 వేల 500పైగా సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ 1, 2 తరగతులు, 1 నుంచి 5 తరగతులకు ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారు.
ఉపాధ్యాయుల బదిలీల చట్టం ఎప్పుడంటే: ఉపాధ్యాయుల బదిలీల ముసాయిదా చట్టాన్ని విద్యాశాఖ ఇప్పటికే తయారు చేసింది. దీన్ని ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. రెండు రోజుల్లో ముసాయిదాను వెబ్‌సైట్‌లో పెట్టి, సూచనలు, సలహాలను స్వీకరించనున్నారు. ముసాయిదాలో పేర్కొన్న కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.
- 2 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీలకు అర్హులు.
- 8 సంవత్సరాలు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది.
- సీనియారిటీని లెక్కించేందుకు అకడమిక్ సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం.
- ఫిబ్రవరి 10లోపు ప్రాథమిక సీనియారిటీ లిస్ట్ విడుదల చేస్తారు
'ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్' లక్ష్యం - ఉపాధ్యాయులపై భారం తగ్గిస్తాం : లోకేశ్