కడప జిల్లా లింగాల మండలం పెద్దకుడాలలో జరిగిన దళిత మహిళ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు అదే గ్రామానికి చెందిన మైనర్లని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. హత్య జరిగిన ప్రదేశంలో మరో వ్యక్తి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. అతన్ని త్వరలో అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్సీ మహిళ హత్యపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎందుకు చంపారు?
పెద్దకుడాలలో నాగమ్మ అనే మహిళ నివాసముంటుంది. ఇంటి పక్కనే ఉండే మైనర్లతో ఆమె సరదాగా మాట్లాదేది. ఆ మాటలను సీరియస్గా తీసుకున్న మైనర్లు మేకలు కాయడానికి గుట్టకు వెళ్లిన నాగమ్మతో అసభ్యంగా ప్రవర్తించారు. సరదాగా అలా అన్నానని ఆమె ఎంత చెప్పినా.. వాళ్లు వినకుండా కిందపడేసి గాయపరిచారు. విషయం గ్రామంలో తెలుస్తుందనే భయంతో బండరాళ్లతో ఆమె తలపై మోదీ హత్య చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తు ఆధారంగా హత్య కేసుగా నమోదు చేశామన్న ఆయన.. ఈ కేసులో మరో నిందితున్ని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోంకు తరలించామని చెప్పారు.
ఇదీ చదవండి: తెదేపా నేతల 'చలో తంబళ్లపల్లి' అడ్డగింత