Uma Shankar Reddy Wife : వైఎస్సార్ కడప జిల్లాలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమా శంకర్ రెడ్డి భార్యపై దాడి చేసిన ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కసనూరుకు చెందిన కొమ్మ పరమేశ్వర్ రెడ్డి, ఆయన కుమారుడు సునీల్ కుమార్ రెడ్డిలు.. తనపై దాడి చేశారని ఉమా శంకర్ రెడ్డి భార్య పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఇద్దర్ని అరెస్టు చేశారు. అనంతరం జమ్మలమడుగులోని కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరు నిందితులకు కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
ఇది జరిగింది : గత నాలుగు రోజుల క్రితం ఉమా శంకర్ రెడ్డి భార్య స్వాతికి మీ ఆయన వివేకానంద రెడ్డిని ఎలా హత్య చేశాడో.. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నీ భర్తను అదేవిధంగా చంపుతామని బెదిరింపులు వచ్చాయని ఆమె ఆరోపించారు. సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన కొమ్మ పరమేశ్వర్ రెడ్డి తనను బెదిరించాడని వివరించారు. పరమేశ్వర్ రెడ్డి పులివెందులలోని స్వాతి ఇంటికి వచ్చి అసభ్యంగా దుర్భాషలాడినట్లు వాపోయారు. వివేకానంద రెడ్డిని హత్య చేసి వచ్చిన డబ్బులతో జల్సా చేసుకుంటున్నారా అని బెదిరించినట్లు తెలిపారు.
పరమేశ్వర్ రెడ్డి చెప్పుతో తనపై దాడికి యత్నించాడని ఆమె వివరించారు. దాడికి యత్నించడమే కాకుండా సెల్ ఫోన్ తీసుకుని కింద పడేశాడని ఆమె వాపోయారు. పరమేశ్వర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ దాడిలో గాయపడినట్లు ఆమె పేర్కొన్నారు. పులివెందుల ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉమా శంకర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఆయన కడప జైలులో ఉన్నారు. సీబీఐ విచారణలో ఆయనకు హత్యకు సంబంధం ఉన్నట్లు సీబీఐ విచారణలో తెలినట్లు సీబీఐ కోర్టుకు అందించిన ఛార్జ్షీట్లో వివరించింది. హత్య జరిగిన రోజు ఉదయం 3గంటల సుమారులో ఉమా శంకర్ రెడ్డి రోడ్డుపై పరిగెత్తినట్లు ఆధారాలు లభించినట్లు తెలిపింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
ఇవీ చదవండి :