కడప జిల్లా జమ్మలమడుగు మండలం పి.బొమ్మేపల్లి గ్రామంలో విషాదం జరిగింది. సరదాగా ఓ యువకుడు బావిలోకి ఈత కొట్టేందుకు దిగి... విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అంకాలమ్మ-గుర్రప్ప దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు గురుప్రసాద్ (16) ఇటీవలే కడపలో ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసుకుని జమ్మలమడుగు వచ్చాడు. జమ్మలమడుగు బీసీ కాలనీలోని తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నాడు.
ఆదివారం.. తన స్వగ్రామమైన పి. బొమ్మే పల్లి గ్రామానికి వెళ్లి అంకాలమ్మ ఆలయం వెనకాల ఉన్న బావిలోకి ఈత కోసం దిగాడు. బావిలోకి దూకి ఈత కొడుతుండగా మెట్ల వద్ద ఉన్న ఇనుప పైపులను పట్టుకున్నాడు. పైపునకు కరెంటు ప్రసరించడంతో ఆ పైపు వెంటే అడుగుకు జారిపోయాడు. ఎంతసేపటికి పైకి రాకపోవడంతో గట్టుపైన ఉన్న సమీప బంధువు కరెంట్ ఆపేసి.. స్థానిక రైతుల సాయంతో బావిలో గాలింపు చర్యలు చేపట్టారు. యువకుడిని పైకిలాగి వెంటనే జమ్మలమడుగులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆ యువకుడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.
ఇదీ చదవండీ... దారుణం.. ముళ్లపొదల్లో శిశువు మృతదేహం