Khadaf vali : అన్నం తినొద్దు, పాలు తాగొద్దు, చక్కెర ముట్టొద్దు... ఖాదర్‌వలీ ఇవన్నీ చెబుతుంటే ఇప్పుడైతే లక్షలాదిమంది కళ్ళప్పగించి చూస్తున్నారు కానీ, పాతికేళ్లకిందట పరిస్థితి వేరు! అప్పట్లో ఆయన మాటలు విన్నవాళ్ళు పిచ్చోడికింద జమకట్టారు. కుహనావైద్యుడేమోనని సందేహించారు. ఇన్ని ఉన్నా, తాను నమ్మినదాని కోసం దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు ఖాదర్‌వలీ. ఆర్థిక సౌఖ్యాలు వదులుకుని అడుగుముందుకేశారు. ఆ అడుగులే నేడు ఆయన్ను ‘పద్మశ్రీ’ దాకా చేర్చాయి. ఆ స్ఫూర్తి ప్రయాణంలోని కొన్ని మైలురాళ్ళు...
అప్పుడు నాకు ఇరవైరెండేళ్ళుంటాయి. భారత్‌లో పీహెచ్‌డీ ముగించి పోస్ట్ డాక్టరేట్ కోసం అమెరికాలోని ఆరెగాన్ రాష్ట్రంలో అడుగుపెట్టాను. వెళ్ళిన తొలిరోజే ‘ఫిట్‌నెస్ సర్టిఫికెట్’ తెచ్చుకోమన్నారు. స్థానిక ఆసుపత్రికి వెళ్ళి... డాక్టర్ కోసం వెయిట్‌చేస్తూ కూర్చున్నాను. నా పక్కనే ఓ ఆరేళ్ల అమెరికన్ పాప ఉంది. ఆ పాపతో మాటలు కలపాలని ప్రయత్నించాను కానీ... నేను ఎంత పలకరించినా తను మారుమాట్లాడలా. పెద్ద తప్పేదో చేసినట్టు దిగాలుగా తలవంచుకుని ఉంది. తల ఎత్తితే ఆకాశం వంక చూస్తోంది కానీ... నన్ను పట్టించుకోవడంలా. ఇంతలో వాళ్ళమ్మ డాక్టర్ దగ్గర్నుంచి విచారంగా బయటకి వస్తే ‘ఈ పాప ఎందుకిలా ఉంది?’ అని అడిగాను. ‘నీకెందుకు..?’ అందామె విసురుగా. ‘తన వయసుకి ఈ దిగులు మరీ ఎక్కువగా అనిపిస్తేనూ అడిగాను... క్షమించండి!’ అన్నాను. ఆమె నన్ను తేరిపార చూసి ‘ఏమీ లేదు... తను పదిరోజులకిందట రజస్వల అయింది. ఆరేళ్లకే కావడం అటుంచితే... రక్తస్రావం ఆగట్లేదు!’ అంది. దిగ్భ్రాంతికి గురయ్యాను. అప్పట్లో మనదేశంలో పద్నాలుగేళ్ళకికానీ అమ్మాయిలు రజస్వల అయ్యేవారు కాదు... ఇక్కడ ఆరేళ్లకే... ఎందుకిలా?! డాక్టర్ దగ్గరకి వెళ్ళి అడిగితే ‘ఇక్కడ 8-9 ఏళ్ళకే అమ్మాయిలు రజస్వల కావడం పెరుగుతోంది. ఈ పాప కేసు కొంత అరుదైనది... అంతే’ అన్నాడు సింపుల్‌గా. ఆయన దగ్గర సర్టిఫికెట్ తీసుకుని కాలేజీలో చేరిపోయానుకానీ... నాకు మూణ్ణాలుగు రోజులపాటు నిద్రపట్టలేదు. ఆ పాపే గుర్తురాసాగింది. వాళ్ళమ్మ నాకు ఆ విషయం చెప్పగానే తన కళ్లలో మెదిలిన నీళ్లూ, తనలో తాను ముడుచుకుపోయిన తీరూ... నన్ను కలవరపెట్టాయి. ఆ విషయంపైన అప్పట్లో నేను స్వతంత్రంగా చేసిన పరిశోధనలే... నా జీవితాన్ని మార్చేశాయి, ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. ఆ వివరాల్లోకి వెళ్ళేముందు...
బుద్ధదేవుని భూమిలో : ఒక్క పద్యం.. జీవితాలని మార్చేస్తుందా? నన్ను మార్చిందనే చెప్పాలి. ‘బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి? అందమును హత్యచేసెడి హంతకుండ, మైలపడిపోయెనోయి నీ మనుజజన్మ’ అన్న వాక్యం అది. కరుణశ్రీగారి ‘పుష్పవిలాపం’లోని ఆ పదాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ కవి పూలకోసమే అంతగా విలవిల్లాడిపోతే... మనుషుల్నే నమ్ముకుని ఉన్న పశుపక్ష్యాదులకి మనం చేస్తున్నదేమిటీ అన్న ఆలోచన నన్ను నిలవనీయలేదు. వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు మాది. నాన్న హుసేన్ సాహెబ్ టైలరే కానీ... కనీస ఆదాయం కూడా ఉండేది కాదు. పూరి గుడిసెలో నివాసం. ఇంట్లో ఇద్దరక్కయ్యలూ ఓ అన్నయ్యా తర్వాత నేను. మా గుడిసెలో అందరూ ఇంటి లోపల నిద్రపోయే పరిస్థితి లేదు. మగవాళ్ళం బయటే పడుకునేవాళ్ళం. నేను చిన్నప్పటి నుంచీ మా మేక, కుక్క, కోళ్ళ మధ్యే నిద్రపోయేవాణ్ణి. వాటిని నా అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళలాగే చూసేవాణ్ణి! అలా చూసుకుంటున్న మేకనో కోడినో మాంసం కోసం నరుకుతుంటే... వద్దంటూ శోకాలు పెట్టి ఏడ్చేవాణ్ణి. నాకు పదకొండేళ్ళప్పుడు అనుకుంటా... మా లైబ్రరీలో ‘పుష్పవిలాపం’ దొరికింది. ఆ పుస్తకం నా జీవకారుణ్యంలో తప్పేమీలేదన్న ధైర్యాన్నీ తెచ్చింది. ఆ రోజుతో... నేను ఇక మాంసం ముట్టనని తెగేసి చెప్పాను. మా ఇంట నన్ను తిట్టనివాళ్ళు లేరు ఆ రోజు. పోనుపోను బంధువులందరూ ముస్లిం ఇంట చెడబుట్టినవాడిగానే నన్ను చూడసాగారు. వాళ్ళ మధ్య అమ్మే నన్ను కాస్త అర్థం చేసుకుంది. ఇంట్లో మాంసం వండినప్పుడల్లా ‘నీ కోసం ఇంకో కూర ఏం చేయనురా!’ అని సణుగుతూనే పప్పూ చారూ చేస్తుండేది. ఐదో తరగతి నుంచే పుస్తకాలు చదివే అలవాటు ఉండటం వల్ల చదువులోనూ రాణించసాగాను. అప్పుడే మా అన్నయ్యకి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. రేణిగుంటలో పోస్టింగు. ఇంట్లో నా ‘శాకాహారదీక్ష’ని భరించలేక కొంతా... అన్నయ్యతో ఉంటే నా చదువుకి ఢోకా ఉండదన్న ఆలోచనతో కొంతా... అమ్మానాన్నలు నన్ను ఆయనతో పంపించేశారు. అలా అన్నయ్యతో ఉంటూ తిరుపతిలో పదో తరగతి, గుంతకల్లులో ఇంటర్ పూర్తి చేశాను. మైసూరులోని రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి బ్యాచిలర్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ చేశాను. రెండింట్లోనూ యూనివర్సిటీ స్థాయిలో ఫస్టొచ్చాను. నన్ను మా ప్రొఫెసర్లు బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఐఐఎస్సీలో పీహెచ్‌డీకి అప్లయి చేయమన్నారు. డిగ్రీలో నేను చదివింది పేరుకి బీఎస్సీయే కానీ... అందులో పెద్దగా సైన్సులేదు. ఆ బేసిక్స్ లేకపోయినా... రెండునెలలపాటు శ్రమించి ఐఐఎస్సీలో సీటు తెచ్చుకున్నాను. అప్పటికే నేను గాంధీ స్వీయచరిత్రని చదివి ఉన్నాను. ఆయన విద్యార్థి దశలో చేసినట్టే... శాకాహారం గురించీ అహింస గురించీ ప్రచారం చేయసాగాను. కనిపించినవాళ్ళందరికీ లెక్చర్లిస్తుండటంతో... స్నేహితులందరూ నన్ను చూసి పారిపోసాగారు.. ఒక్కరు తప్ప!
హోమియోపతితో ప్రయోగాలు.. : ఆ ఒక్కరు ఉష. తనూ వర్సిటీలో పీహెచ్‌డీ చేస్తుండేది. మా స్నేహం ప్రేమగా మారి పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాక... మతాలని కారణంగా చూపి ఇద్దరి పెద్దలూ మమ్మల్ని వెలివేసేశారు! మేమూ ఇరుమతాలనీ మరచి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. అప్పట్లోనే నాకు హోమియోపతితో పరిచయం ఏర్పడింది. ఓ సైంటిస్టుగా మొదట్లో దాన్ని నేను నమ్మలేదు. పుస్తకాలు చదివి నామీద నేనే ప్రయోగాలు చేసుకోసాగాను. కొంత నమ్మకం వచ్చాక అప్పట్లో నా స్నేహితుడి భార్య గర్భసంచిలో పెద్ద గడ్డ చేరి ఆపరేషన్ చేయాలంటేనూ... నా హోమియో మందులతో నెలలో తగ్గించగలిగాను. ఈలోపు అమెరికాలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ రావడంతో... హోమియోపతిని కాస్త పక్కనపెట్టి అక్కడికెళ్ళాను. వెళ్ళిన మొదటి రోజే ఆ పాపని చూశాను.
ఎందుకలా జరుగుతోంది : సాధారణంగా ఆడపిల్లలు రజస్వల అయ్యే వయసు... ఆయా వాతావరణాన్ని బట్టే ఉంటుందనే నమ్మకం మనదగ్గర ఉంది. అమ్మాయిలు పోషకాహారం తిని పుష్టిగా ఉన్నా తొందరగా అవుతారని భావిస్తుంటారు. అది నిజం కాదు. అమ్మాయిల రుతుక్రమం వయసు తగ్గిపోవడానికి వాటికి సంబంధించిన హార్మోన్‌ల స్వభావం మారడమే కారణం. నువ్వెలా చెప్పగలవూ అంటే... నేను ఐఐఎస్సీలో పీహెచ్‌డీ చేసింది శరీరంలోని సహజ స్టెరాయిడ్‌లపైన కాబట్టి. వాటికి కారణమైన హార్మోన్‌లు ఏ రకంగా శరీర ధర్మాన్ని నియంత్రిస్తాయో నాకో అవగాహన ఉంది. అమెరికన్ పిల్లల్లో హార్మోన్ల స్వభావం మారడానికి కారణం ఏమిటని చూస్తే... నా దృష్టి అక్కడి ఆహారంపైన పడింది. ముఖ్యంగా.. పశువులకి హార్మోన్ ఇంజక్షన్‌లిచ్చి పాల ఉత్పత్తి పెంచడాన్ని గమనించాను. అలాంటి పాల వాడకం పెరిగినందువల్లే అమ్మాయిల్లో రజస్వల వయస్సు 12 నుంచి 8-9కి పడిపోయిందన్నది నా భావన. అది ఆ ఆరేళ్ళ పాపలో మరీ వైపరీత్యానికి దారితీసిందనే నిర్ణయానికొచ్చాను. అప్పుడే తొలిసారి - కార్పొరేట్ సంస్కృతిలో భాగంగా మారిపోయిన ఆహార పరిశోధనలూ, జన్యుమార్పిడి వంగడాలూ, వాటి ఇబ్బడిముబ్బడి దిగుబడులూ, హరిత విప్లవాలపైన నాలో అనుమానాలు రేకెత్తాయి. మనం విచక్షణారహితంగా పండిస్తున్న వరి, గోధుమల సాగు వల్ల మరుగునపడిపోయిన చిరుధాన్యాల పరిస్థితేమిటని చూశాను. చూస్తే ఏముంది... వరీ గోధుమలకన్నా వెయ్యిరెట్లు ఆరోగ్యకరమైన చిరుధాన్యాలకి సంబంధించిన కొన్ని విత్తనాలు పూర్తిగా అంతరించాయని అర్థమైంది. నా చిన్నప్పుడు మా అమ్మమ్మా నాన్నమ్మలూ వాటినే తినేవాళ్లు. అవన్నీ ఇప్పుడేమైనట్టు? వాటికి పునరుజ్జీవనం కల్పించడమే సైంటిస్టుగా నా బాధ్యతనుకున్నాను. ఆ లక్ష్యంతోనే అమెరికాలో పోస్ట్ డాక్టరేట్ అయ్యాక మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీఎఫ్‌టీఆర్‌ఐ)లో సైంటిస్టుగా చేరాను. కానీ ఇక్కడికొచ్చి నేను చిరుధాన్యాలపైన పరిశోధన చేస్తానంటే నన్నో పిచ్చివాడికిందే చూశారు. ‘అమెరికాలో ఇప్పుడు సోయాబీన్స్‌దే ట్రెండు. ఇక్కడా వాటిపైనే పరిశోధన చెయ్’ అన్నారు. నేను రాజీనామా చేసేశాను!
వీడని పేదరికం : ఎన్ని గొప్ప ఆశయాలున్నా... ఆర్థిక ఇబ్బందుల ముందు ఎవరైనా తలొంచాల్సిందే. నా పరిస్థితీ అదే. నేను సైంటిస్టునైనా సరే... మమ్మల్ని పేదరిక ఛాయలేవీ వీడలేదు. మా పాప కడుపులో పడింది. దాంతో ఎంతోకొంత డబ్బు సంపాదించడమే లక్ష్యంగా... డ్యూపాంట్ సంస్థలో చేరి అమెరికా వెళ్ళాను. దాదాపు ఐదేళ్ళపాటు అందులో పనిచేస్తే పన్నెండు లక్షల రూపాయలొచ్చాయి. ఇండియా వచ్చాక ఆ డబ్బుని బ్యాంకులో వేసి వడ్డీతో స్వతంత్ర శాస్త్రవేత్తగా పరిశోధనలు మొదలుపెట్టాను. అప్పటికే మా ఇంటి చుట్టుపక్కలవాళ్ళకి నేను హోమియోపతి మందులు ఇస్తూ ఎంతోకొంత పేరుతెచ్చుకున్నాను. ఆ మందులకి అదనంగా - ఎక్కడెక్కడో వెతికి తెచ్చిన సామల్లాంటివాటిని వాళ్ళ అనారోగ్యానికి విరుగుడుగా ఇవ్వడం మొదలుపెట్టాను. మంచి ఫలితాలు కనిపించాయి. అప్పుడే నగర సంస్కృతి అంటని గిరిజనులు కొందరు అరుదైన చిరుధాన్యాలు తింటున్నారని విని వెతుక్కుంటూ వెళ్ళాను. వాళ్ళదగ్గరే వాటిని తొలిసారి సేకరించాను. ఓ శాస్త్రవేత్తగా - మన చుట్టూ ఉన్న అన్నిధాన్యాలకన్నా వాటిలో పిండి పదార్థాలు, పీచు నిష్పత్తి అతితక్కువని నిరూపించాను. వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువని సశాస్త్రీయంగా వర్గీకరించాను.
సిరి ధాన్యాల సాగు : నేనూ రైతుగా మారాలనుకున్నాను. అప్పుచేసి కొంత భూమి కొని... సామలు, కొర్రలు, అండుకొర్రలు, అరికెలు, ఊదలు... ఈ ఐదింటిని సాగుచేస్తూ వాటికి సిరిధాన్యాలని పేరుపెట్టాను. వాటిని తీసుకుని - కర్ణాటక పల్లెలకి వెళ్ళి సాగుభూముల్లో ఓ మూలగానైనా వీటిని వేయమని రైతుల్ని ప్రాథేయపడ్డాను. ఇందుకోసం వేలాది గ్రామాల్లో వందలాది సభలు పెట్టాను. సిరిధాన్యాలు తెచ్చే నిండైన ఆరోగ్యంపైన పుస్తకాలు రాశాను. నా కార్యక్రమాల్ని కన్నడ మీడియా ప్రసారం చేయడం ప్రారంభించడంతో... ఓసారి హైదరాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఇంజినీర్ల సంఘం సమావేశానికి పిలిచారు. ఆ తర్వాతి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నా చేత ప్రసంగాలు ఇప్పించడం మొదలుపెట్టారు. వాటితో ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని సిరిధాన్యాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి! మరోవైపు, ‘రైతునేస్తం సంస్థ ఇరురాష్ట్రాల్లోనూ వేల ఎకరాలలో సిరిధాన్యాలని పండించడం ప్రారంభించింది. అది చూసి... అటు కన్యాకుమారి నుంచి ఇటు కశ్మీర్ దాకా అన్ని రాష్ట్రాల్లోనూ వీటిని పండించసాగారు. కొన్నిచోట్ల ప్రభుత్వాలే వీటిని ప్రోత్సహిస్తున్నాయి. ‘ఇండియన్ మిల్లెట్ మ్యాన్’ అంటూ నన్ను వాళ్ళకి పరిచయం చేస్తున్నాయి! ఇప్పుడు నేనో శాస్త్రవేత్తనే కాదు, ఆహారంతో రోగాలు నయం చేయొచ్చని నిరూపిస్తున్న వైద్యుణ్ణి కూడా. వరి బియ్యాన్ని కాదని... సిరిధాన్యాల వైపు నడవమంటున్న నాకు వచ్చిన ఈ పద్మశ్రీ... వ్యవసాయం వైవిధ్య పంటల బాటపట్టాలనీ, జంతుప్రేమతో శాకాహారులుగా మారాలనీ కోరుకునే ప్రతి ఒక్కరికీ దక్కినట్టే భావిస్తున్నాను!
చీరయినా కొన్నది లేదు : నా విజయంలో మా ఆవిడది ఒట్టి సహకారం కాదు... సగంకన్నా ఎక్కువ భాగస్వామ్యం. నా వెనక కాదు... నా చుట్టూ తనే ఆవరించుకుని ఉందని చెప్పాలి. ఓ రకంగా తన భుజాలపైన నిల్చునే నేనీ ప్రపంచాన్ని చూస్తున్నానన్నా అతిశయోక్తి కాదు! అమెరికా నుంచి వచ్చేస్తున్నప్పుడైనా, సైంటిస్టుగా రాజీనామా చేస్తున్నప్పుడైనా తను ‘ఎందుకు?’ అని అడిగింది లేదు. పైగా- అతితక్కువ వనరులతో జీవించడం ఎలాగో తనే నాకు నేర్పింది. తనకెన్నడూ చీరయినా కొనిపెట్టి ఎరగను. మాకో పాప... సరళ. తనూ హోమియోపతి వైద్యం చదువుకుని... నాలాగే సిరిధాన్యాలపైన అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది.
ఇవీ చదవండి :