మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నిన్న సాయంత్రం గోవాలో సునీల్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ ధ్రువీకరించింది. ఈరోజు ఉదయం సునీల్‌ను గోవా స్థానిక కోర్టులో హజరుపరిచి సీబీఐ అధికారులు ట్రాన్సిట్ రిమాండ్‌లోకి తీసుకున్నారు. రేపు సునీల్ యాదవ్‌ను కడప కోర్టులో సీబీఐ అధికారులు హాజరుపర్చనున్నారు.
సునీల్ యాదవ్‌ను విచారిస్తున్న సీబీఐ
కడప కేంద్ర కారాగారం అతిథిగృహానికి స్పెషల్ పార్టీ పోలీసులు చేరుకున్నారు. విచారణ సందర్భంగా భద్రతా బలగాలను కడప కేంద్ర కారాగారానికి సీబీఐ రప్పించింది. సునీల్ యాదవ్‌తో పాటు మరికొందరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి కడప జిల్లా పులివెందులలోని తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు.
గతంలో హైకోర్టును అశ్రయించిన సునీల్ యాదవ్
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తమను సీబీఐ వేధిస్తోందని కడప జిల్లా మోతునూతలపల్లికి చెందిన యదాతి సునీల్ యాదవ్, అతడి కుటుంబ సభ్యులు, మరో ముగ్గురు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. సీబీఐ అధికారులు విచారణ నిమిత్తం దిల్లీకి పిలిపించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్నారు. అనుమతి లేకుండా లై డిటెక్టర్ వినియోగించారన్నారు. అరెస్టుతో పాటు తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీబీఐని ఆదేశించాలని కోరారు.
ఇదీ చదవండి