Amararaja industry shifting to Telangana: అమరరాజా పరిశ్రమ తెలంగాణకు తరలిపోవడంపై రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల దాడి కొనసాగుతోంది. జగన్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధించి, వెంటాడటంతోనే... వారు పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారని... తెలుగుదేశం ఆరోపించింది. విపక్ష విమర్శలపై స్పందించిన అధికార పక్షం..పరిశ్రమల ఏర్పాటను తాము రాజకీయ కోణంలో చూడలేదని సమర్థించుకుంటోంది.
రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడం కోసమే జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను, సామర్థ్యాన్ని నాశనం చేస్తోందని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. పరిశ్రమలు ఆకర్షించేందుకు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటే, ఏపీ మాత్రం కంపెనీలను తరిమికొడుతోందని ఎద్దేవా చేశారు. రాయలసీమలో 4 దశాబ్దాల కాలంలో లక్ష కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించి రాష్ట్రానికే గర్వకారణంగా.. అమర్ రాజా సంస్థ నిలిచిందన్నారు. బిలియన్ డాలర్ల కంపెనీ.. ఇప్పుడు తన సొంత రాష్ట్రాన్ని విడిచిపెట్టి 9500 కోట్ల పెట్టుబడితో.. పొరుగు రాష్ట్రానికి తరలిపోయిందన్నారు. తమకు అనుకూలురైన వాటాలిచ్చే వారినే, జగన్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టనిస్తోందని... పరిశ్రమల శాఖ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వ వేధింపులు, వసూళ్లు భరించలేక.. ఏపీలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రావడంలేదని,మరో సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో దేశంలో తొలిస్థానంలో ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్... 14వ స్థానానికి పడిపోవడం సిగ్గుచేటన్నారు. ఉన్న పరిశ్రమల్ని బెదిరించి.. తమ వారికి కట్టబెట్టే పరిస్థితులు ఏపీలో ఉన్నాయన్నారు.
'తమ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటును ఎప్పుడూ రాజకీయ కోణంలో చూడలేదు. అమరరాజా సంస్థ..కాలుష్య నిబంధనలను సరిగా పాటించలేదు. తెలంగాణలో పెట్టుబడి పెడితే ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లగొట్టినట్లా.?' పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్
ఇవీ చదవండి: