TDP MLC Bhumireddy Ram Gopal Reddy on Education System in AP: విద్యా వ్యవస్థ గురించి గొప్పగా మాటలు చెప్పే ముఖ్యమంత్రి.. పులివెందులలో ఒక్క విద్యార్థి కూడా ఎందుకు ఇంటర్ పాస్ కాలేదో సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందులలోని వేముల జూనియర్ కళాశాలలోనే నూరు శాతం సున్నా ఫలితాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విద్యా విధానాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచడమంటే ఇదేనా అని ప్రశ్నించారు.
పదో తరగతి ఫలితాల్లో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలు అట్టడుగు స్థానాల్లో నిలవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అరకు మహిళా కళాశాల తరగతి గదిలో పెచ్చులూడి పడటమేనా నాడు-నేడు నిర్వహణ అంటే అని నిలదీశారు. నాడు-నేడు పేరుతో 16వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను చివరి స్థానానికి నెట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు.
ప్రాథమిక విద్య, యూజీ, పీజీ అనే తేడా లేకుండా వ్యవస్థ మొత్తాన్ని కుప్పకూల్చారని ధ్వజమెత్తారు. ఇష్టం లేని విద్యా శాఖ బాధ్యతలను మంత్రి బొత్స సత్యనారాయణ బలవంతంగా నిర్వర్తిస్తున్నారని ఆక్షేపించారు. ఇతర శాఖకు మారే యోచనలోనే నిత్యం వివాదాలు మాట్లాడుతూ తెలంగాణ నేతలతో తిట్టించుకుంటున్నారని విమర్శించారు.
గతంలో ఏ విధంగా అయితే జీవో నెం 1 తీసుకొచ్చి రాష్ట్రంలో సభలు, సమావేశాలు నిర్వహించకూడదని చెప్పారో.. ఇప్పుడు కడప జిల్లాలో కూడా అలాంటి నల్ల జీవోనే తీసుకొచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులు నిరసనలో పాల్గొనకూడదంటూ కడప జిల్లాలో మాత్రమే నల్ల జీవో తెచ్చారని మండిపడ్డారు. డీఈవో ఎవరి అనుమతితో ఈ జీవో తీసుకొచ్చారని ప్రశ్నించారు. విద్యాశాఖ అనుమతి ఉందా లేకుంటే.. ముఖ్యమంత్రి జగన్ అనుమతి ఉందా అని నిలదీశారు. ఈజీవో తెచ్చిన డీఈవోపైన రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ చర్యలు తీసుకోవాలని లేకుంటే.. ఆందోళనలు చెపడతామని హెచ్చరించారు.
అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీని నిర్వహించిన ఖాళీగా ఉన్న పోస్టులన్నింటిన భర్తీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజుకు కూడా ఒక్క ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయకుండా అటు నిరుద్యోగులను, ఇటు ప్రాథమిక విద్యను కూడా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే జగన్ రాష్ట్రంలో విద్యావ్యవస్థపై చేస్తున్న పనులకు నిరసనగా రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు, నిరుద్యోగులు.. గళం విప్పాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే విద్యార్థి సంఘాలు కూడా చైతన్యవంతులై జగన్ మోహన్ రెడ్డి అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు.