YS Viveka Murder Case: వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి కేవలం చిన్న చేపలు మాత్రమేనని... టీడీపీ నేత, పులివెందుల ఇన్చార్జి బీటెక్ రవి ఆరోపించారు. అసలైన పెద్ద చేపలు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నాయని వెల్లడించారు. వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన బీటెక్ రవి... వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడం కొంత న్యాయం జరిగిందని అన్నారు. ప్రధానంగా వివేకా కుమార్తె సునీత పోరాటానికి న్యాయం జరిగినట్లు భావిస్తున్నట్లు బీటెక్ రవి పేర్కొన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లోని పెద్ద చేపలపై సీబీఐ దృష్టి పెడితేనే నిజమైన న్యాయం జరుగుతుందని వెల్లడించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి ఘటనతో టీడీపీ నేతలు ఎవరూ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని చెప్పారు. త్వరలోనే పులివెందులలో తెలుగుదేశం జెండా ఎగిరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీటెక్ రవి ఆశాభావం వ్యక్తం చేశారు.
భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి : వివేకానంద రెడ్డి హత్య కేసులో వైయస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబీకుల హస్తం ఉందని స్పష్టమైందని పట్టభద్రుల శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని భూమిరెడ్డి డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో కీలక వ్యక్తులుగా ఉన్నవారిని సీబీఐ అరెస్టు చేసిందని ఆయన వెల్లడించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు హత్య చేశారని లేనిపోని అభాండాలు వేశారని పేర్కొన్నారు. సాక్షి దినపత్రికలో నారా సుర రక్త చరిత్ర అని రాశారని గుర్తుచేశారు. తాజాగా వైఎస్ కుటుంబం హస్తముందని సీబీఐ స్పష్టం చేసిందని భూమిరెడ్డి తెలిపారు. వైయస్ అవినాష్ రెడ్డి తండ్రి వైస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడంతో అసలు కథ ఇప్పుడే మొదలైంది అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో టీడీపీకి రవ్వంత కూడా సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కోడి కత్తి కేసు కూడా ఒక బూటకమని విషయం ప్రజలందరికీ తెలిసిపోయింది అన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు.
పత్తిపాటి పుల్లారావు: వివేకా హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏప్రిల్ 30 కు డెడ్ లైన్ విధించడంతో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం బయటకు వస్తుందని టీడీపీ నేత పత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఇప్పటికే సీబీఐ వివేకా హత్య కేసులో అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారని వెల్లడించారు. రేపో, మాపో అవినాష్ రెడ్డి కూడా అరెస్టు కావచ్చని అంటున్నారన్నారు. ఈ కేసు తాడేపల్లి ప్యాలెస్‌కు తాకుతుందన్నారు. అసలు కుట్ర దారులను గుర్తించకుండా ఈ కేసు ముగింపు పలికే అవకాశం ఉండదని, తప్పకుండా అసలు పాత్రదారులు రాబోయే రోజుల్లో బయటకు వస్తారని పత్తిపాటి పేర్కొన్నారు. కోడి కత్తి కేసులో ఎన్ఐఏ వాస్తవాలు బయట పెట్టడంతో ప్రజలు జగన్ రెడ్డిని చీకొడుతున్నారన్నారని పత్తిపాటి వెల్లడించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలతో సానుభూతి పొంది అధికారంలోకి రావడానికి ప్రయత్నించారని పత్తిపాటి ఆరోపించారు. జగన్ దుర్మార్గపు ఆలోచనలు నేడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: