రాయలసీమకు ఎవరు నీళ్లిచ్చినా స్వాగతిస్తామని కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీవో సరిగ్గా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లక్ష క్యూసెక్కుల సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ఆయన సవాల్ చేశారు. రాయలసీమ వాసులకు తాగు, సాగునీటి సౌకర్యం కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే తెలుగుగంగ, గాలేరునగరి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని వివరించారు.
పోతిరెడ్డిపాడును చేపట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని శ్రీనివాస్ రెడ్జి తెలిపారు. వైకాపా ప్రభుత్వం రాయలసీమ నీటి అవసరాల కోసం జీవో ఇస్తే.. తెలంగాణ ప్రభుత్వం, అక్కడి విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం, విపక్షాల వ్యతిరేకతను ఏవిధంగా ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందో జగన్ మోహన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. 203 జీవో ఇచ్చి దానిపై తెదేపా వైఖరి చెప్పాలని మంత్రులు ప్రశ్నిస్తున్నారన్న ఆయన... ఏడాది కాలంలో ఇచ్చిన జీవోలన్నిటిపైన తెదేపా వైఖరి తీసుకున్నారా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: 'వడ్డీ రేట్లు తగ్గింపు- ఈఎంఐలపై మారటోరియం'