Chandrababu written letter to AP DGP: కడప జిల్లా నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవికి భద్రత తొలగించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీటెక్ రవికి భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం ముగిసిందనే కారణంతో బీటెక్ రవికి భద్రతను తొలగించడం సరికాదని లేఖలో ప్రస్తావించారు. 2006 నుంచి బీటెక్ రవికి 1 ప్లస్ 1 సెక్యూరిటీ కవర్ ఉందని గుర్తు చేశారు.
రాజకీయ ప్రత్యర్థులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి రవికి నిరంతరం బెదిరింపులు ఉన్నందున భద్రత కొనసాగిందన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన బీటెక్ రవికి 2 ప్లస్ 2 భద్రత కల్పించారని, అయితే ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడాన్ని సాకుగా చూపి అతని భద్రతను తొలగించారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజక వర్గానికి పోలింగ్ జరిగిన మార్చి 13వ తేదీన అతని కాన్వాయ్‌పై గూండాలు దాడి చేశారని ఆయన తెలిపారు.
ఆ దాడిలో అతని కారు ధ్వంసమైపోయిందని, ప్రమాదం నుంచి రవి తృటిలో తప్పించుకున్నారని చంద్రబాబు వెల్లడించారు. దీంతో పాటు బీటెక్ రవిని రాజకీయ ప్రత్యర్థులు భౌతికంగా తొలగించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో బీటెక్ రవిని నిందితుడిగా చేర్చాలని ఆయన రాజకీయ ప్రత్యర్థులు కూడా ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు వాపోయారు.
ఇలాంటి సమయంలో బీటెక్ రవికి ఏదైనా హాని జరిగితే పోలీసులు, ప్రభుత్వమే అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. కడప జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా బీటెక్ రవికి తగిన భద్రత కల్పించాలని కోరారు.
ఇదిలా ఉండగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు చంద్రబాబు కడప, ప్రకాశం, పల్నాడులో పర్యటించనున్నారు. ఈ రోజు వైయస్సార్ కడప జిల్లాలో జరిగే పార్టీ జోనల్లో ఆయన పాల్గొననున్నారు. ఆయన అధ్యక్షతన ఐదు పార్లమెంటరీ వర్గాల పరిధిలోని 35 అసెంబ్లీ స్థానాలపై 'టీడీపీ జోన్ 5 ప్రాంతీయ సమావేశం' నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప, కర్నూల్, అనంతపురం జిల్లాల నేతలు పాల్గొననున్నారు. ఎన్నికల సన్నద్ధతపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
ఓటర్ వెరిఫికేషన్, కుటుంబ సాధికార సారధి కార్యక్రమంపై పార్టీ శ్రేణులకు శిక్షణ అందించనున్నారు. అనంతరం అమీన్‌పీర్ దర్గాలో జరిగే ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొననున్నారు. బుధవారం ప్రకాశం జిల్లా గిద్దలూరులో, ఈ నెల 20న మార్కాపురంలో, 21 తేదీన యర్రగొండపాలెంలో ఆయన పర్యటించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటనకు భద్రత కల్పించాలని డీజీపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. బాబు పర్యటనకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: