ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాదని మనస్తాపానికి గురై.. విద్యార్ధి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కడపలో జరిగింది. కడపకు చెందిన ఓ విద్యార్థిని (17) ఇంటర్మీడియట్ చదివి ఎంసెట్ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆన్‌లైన్ తరగతులు సరిగా వినకుండా, చదవకుండా ఉన్న ఆమెను తల్లి ఇంకెప్పుడు చదువుతావని మందలించింది. దీంతో తాను సరిగా చదవలేదని, ఎంసెట్ పరీక్ష రాసినా మంచి ర్యాంకు రాదని, ఇంట్లో, బయట అవమానంగా ఉంటుందని మనో వేదనకు గురై చదువుకునేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోని పడక గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది.
ఎంత సేపటికి బయటకురాకపోవడంతో తలుపు పగులగొట్టి చూసేసరికి చీరతో పంకాకు ఉరేసుకుని విగత జీవిగా కనిపించింది. వెంటనే ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఎంసెట్‌కు తొలిరోజు 84.43% హాజరు