Girl Student Suffering With Brain Cancer In Kadapa : గాలిపోతుల పావని.. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. పరీక్షల్లో మార్కులు పెరుగుతున్నా.. ఈమె ఆయుష్షు మాత్రం రోజురోజుకీ తగ్గిపోతోంది. భయంకరమైన బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడిన ఈ చిన్నారి.. పంటి బిగువున బాధను భరిస్తూ కాలానికి ఎదురీదుతోంది. గతంలో వచ్చిన బ్లడ్ క్యాన్సర్‌ను జయించిన ఈ చిన్నారి ఇప్పుడు బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతోంది.
మద్యానికి బానిసై కుటుంబాన్ని వదిలేసి తండ్రి వెళ్లిపోగా.. పాప భారాన్ని తల్లి సునీతే భరిస్తోంది. 2020లో కరోనా సమయంలో పావనికి జ్వరం రావడంతో తల్లి వైద్యులను సంప్రదించింది. అలా తన కుమార్తెకు బ్లడ్ క్యాన్సర్ సోకిందని తెలుసుకుని కన్నీరు మున్నీరైంది. ఆ తర్వాత హైదరాబాదులోని బసవతారకం ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించగా.. క్యాన్సర్ తగ్గుముఖం పట్టింది. ఇక పర్వాలేదు అనుకునేలోగా మళ్లీ బ్రెయిన్ క్యాన్సర్ సోకింది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన తల్లి.. కుమార్తె వైద్యం కోసం నానా తిప్పలు పడుతోంది. ఎముకల మార్పిడి చేస్తే గాని ఆరోగ్యం కుదుటపడదని వైద్యులు చెప్పడంతో.. నిస్సహాయ స్థితికి చేరింది.
కుమార్తెను బతికించుకునేందుకు ఇంటిలోని వస్తువులతో పాటు,.. బంగారం, ద్విచక్ర వాహనం అమ్మేసిన తల్లి.. ఇప్పుడు ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తోంది. వైద్యానికి కనీసం 20 లక్షల రూపాయలు ఉంటే కానీ తమ పాప బతకదని కన్నీరుమున్నీరవుతోంది. ఎవరైనా దాతలు ముందుకు వస్తే తమ కుమార్తెకు పునఃజన్మ ఇచ్చిన వారవుతారని వేడుకుంటోంది.
ఇవీ చదవండి: