కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో రెండో విడత అమ్మ ఒడి పథకం ప్రారంభమయ్యింది. కోడూరులోని హెచ్ఎమ్ఎమ్ హై స్కూల్లో ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో మొత్తం రూ.36 కోట్లతో 43వేల మంది విద్యార్థులకు, 24వేల మంది తల్లుల ఖాతాల్లో జమచేయనున్నట్లు కొరముట్ల తెలిపారు. ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు.
మనబడి, నాడు నేడు ద్వారా ప్రైయివేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు పోషకాహారం అందించడం, జగనన్న విద్యా కానుక, వసతి దీవెన పథకం ద్వారా విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా చిన్నారులను బడికి పంపిన తల్లులకు ఆర్థిక సాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం తల్లిదండ్రులకు, విద్యార్థులకు చెక్కులను అందజేశారు.
హామీలు నెరవేర్చుతున్నాం..
ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష అన్నారు. రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. కడప ఉర్దూ మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన అమ్మ ఒడి కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 4,23,011 అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు.
దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నామని వివరించారు. అనంతరం వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ.. విద్యార్థులు చేసిన నాటకం అందరినీ అలరించింది.
మా పథకాలకే పేర్లు మార్చారు..
అమ్మ ఒడి పథకం బోగస్ అని రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ పథకానికి నిధులన్నీ వివిధ కార్పొరేషన్ల నుంచి మళ్లించారని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల నుంచి నిధులు తెచ్చి కొత్త పథకమని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో చేసిన పథకాల పేర్లు మార్చి ప్రచారం చేసుకోవడం జగన్కు అలవాటయ్యిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఉన్న ఫీజు రియింబర్స్మెంట్ పథకానికి జగన్ అన్న విద్య దీవెన, ఉపకార వేతనాల పథకానికి జగన్ అన్న వసతి దీవెన, బడుల మెయింటినెన్స్ పథకానికి మనబడి, నాడు నేడు, మధ్యాహ్న భోజనానికి జగనన్న గోరుముద్ద అని కేవలం పేర్లు మార్చరని వివరించారు. విద్యారంగాన్ని సీఎం జగన్ భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఇప్పటికైనా మాటలు తగ్గించుకొని చేతలతో విద్యారంగాన్ని మెరుగుపరచాలని తులసి రెడ్డి సూచించారు.
ఇదీ చదవండి: విద్యతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి