Sagileru Ambedkar Gurukula School Buildings Damaged in Kadapa District: రాష్ట్రంలో పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయాలనే ఆశయంతో అంబేడ్కర్ గురుకులాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే వీటిని దాదాపు కాలం చెల్లిన భవనాల్లోనే నడిపిస్తోంది. మంచి విద్య, ఉపాధ్యాయుల సౌకర్యాలు ఉన్నా.. ప్రమాదాలకు తావిచ్చేలా మారిన భవనాలు విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇలాంటి దుస్థితే కడప జిల్లాలోని సగిలేరు అంబేడ్కర్ గురుకులాన్ని పట్టి పీడిస్తోంది.
సరిగ్గా ఏడాది కిందట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున.. జిల్లా ఉన్నతాధికారులు తరగతి గదుల రూపురేఖలను మారుస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వైయస్సార్ కడప జిల్లాలో.. ఇలా విద్యార్థులు ప్రమాదకర పరిస్థితుల మధ్య చదువులను కొనసాగిస్తున్నారు.
ఈ పాఠశాలలో దాదాపు 700మంది విద్యార్థులు చదువుకునే సామర్థ్యంతో ఏర్పాటు చేయగా.. అది నేడు శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడూ కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని తరగతి గదుల్లో పైకప్పు పెచ్చులూడిపోయి ఇనుప చువ్వలు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని తరగతి గదుల్లో పెచ్చులు ఎప్పుడు రాలి మీద పడుతాయో తెలియని పరిస్థితి ఉంది.
వర్షం వస్తే తరగతి గదులు కురుస్తున్నాయని విద్యార్థులు అంటున్నారు. తరగతి గదుల వద్ద జారుడుగా మారి కిందపడిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి వసతి లేక తొట్టిలో నిల్వ చేస్తున్న అపరిశుభ్ర నీటిని విద్యార్థులు తాగి దాహార్తిని తీర్చుకుంటున్నామన్నారు. ఈ నీటిని తాగటం వల్ల అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల అవరణలోనే వసతి గృహం ఉండగా.. దాని చుట్టూ ప్రహారి గోడ సరిగా లేదని విద్యార్థులు అంటున్నారు. దీనివల్ల లోపలికి పశువులు వస్తున్నాయని చెప్తున్నారు. విద్యుత్ లైట్లు లేకపోవటంతో రాత్రి పూట నానా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వసతి గృహం కూడా సరిగా లేదని వర్షం వస్తే.. వసతి గృహం కురుస్తోందని అంటున్నారు. దీనివల్ల వర్షం వచ్చినప్పుడు కంప్యూటర్ ల్యాబ్‌లోనే విద్యార్థులందర్నీ ఉంచుతున్నారని అన్నారు.
వసతి గృహాల వద్ద మరుగుదొడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వాటిని వినియోగించలేని స్థితికి చేరుకోవటంతో విద్యార్థులు బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయాల్సిన దుస్థితి నెలకొంది. మురుగునీటి కాలువ సరిగా లేక మురుగు పాఠశాల ప్రాంగణంలోనే పారుతోంది.
ప్రభుత్వం దీని గురించి పట్టించుకోకపోవటంతో పేద విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యను అభ్యసించాలంటే వెనకడుగు వేస్తున్నారు. దాదాపు 700 మంది విద్యార్థులకు విద్య అందించే సామర్థ్యమున్న ఈ అంబేడ్కర్ గురుకులంలో ప్రస్తుతం 360 మంది విద్యార్థులే విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలో నూతనంగా ఇంటర్ విద్యను ప్రవేశపెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకు వచ్చి నూతన భవనాల నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు కోరుకుంటున్నారు.
"విద్య సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి. కానీ, వసతులు లేవు. వర్షం పడినప్పుడు తరగతి గది దగ్గరికి వెళ్లాలంటే జారి కిందపడిపోతున్నాము. పందులు వస్తున్నాయి. చుట్టూ ప్రహారీ గోడ సరిగా లేదు. రాత్రి సమయంలో మరుగుదొడ్డికి వెళ్లాలంటే భయంగా ఉంది." - విద్యార్థి, సగిలేరు అంబేడ్కర్ గురుకులం
మాకు సరైన వసతులు లేవు. వర్షం పడితే రాత్రులు పడుకోవటానికి ఇబ్బందిగా మారింది. వసతి గృహ రూమ్‌లు సరిపోవటం లేదు. మాకు ఇక్కడ ఫ్యాన్లు, లైట్లు లేవు. - విద్యార్థి, సగిలేరు అంబేడ్కర్ గురుకులం