అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ బాషాభాయ్ని అరెస్టు చేసినట్లు కడప ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. వారం కిందట వల్లూరు మండలం గోటూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు తమిళ కూలీలు సజీవ దహనం కావడానికి ప్రధాన సూత్రధారి బాషాభాయ్గా గుర్తించామని, అతనితో సహా 12 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. బాషాభాయ్ అసలు పేరు హకీమ్ అలీ అలియాస్ బాషాభాయ్గా పేర్కొన్నారు. ఈ ఘటనలో మొత్తం 5 మంది సజీవదహనమయ్యారని ఎస్పీ వివరించారు. కేసు దర్యాప్తునకు ఐదు బృందాలు పనిచేశాయని తెలిపారు. సైబర్ టీమ్ ఇచ్చిన కీలక సమాచారం మేరకు నిందితులను పట్టుకోగలిగామన్నారు.
తమిళ కూలీలు ఇచ్చిన సమాచారం మేరకు కోడూరులో ఇద్దరిని పట్టుకున్నాం. బాకారపేటలో ఎర్రచందనం దుంగలు లోడ్ చేశారు. తమిళ కూలీలు, వెంబడించిన కారులోని వాళ్లతోనూ బాషాభాయ్ టచ్‌లో ఉన్నాడు. - ఎస్పీ అన్బురాజన్
బాషాభాయ్ తమిళనాడు, బెంగళూరు కేంద్రాలుగా ఎర్రచందనం అక్రమ రవాణ చేస్తూ స్థానిక లోకల్ గ్యాంగ్లను ఏర్పాటు చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ప్రమాద ఘటన జరిగిన తర్వాత 5 పోలీసు బృందాలు తమిళనాడు, కర్నాటక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టాయన్న ఎస్పీ... ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బాషాభాయ్ ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రాయచోటి, కడప, పెండ్లిమర్రి ప్రాంతాల్లో బాషాభాయ్ కి స్థానిక ముఠాల సహకారం ఉందన్నారు. వారి నుంచి టన్ను ఎర్రచందనం దుంగలు, లారీ, కారు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బాషాభాయ్ కడప వాసి కావడంతో స్థానికంగా ఉన్న సంబంధాల ద్వారా ఎర్రచందనం అక్రమ రవాణ చేస్తున్నాడని ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరించారు. ఈనెల 2వ తేదీ జరిగిన ప్రమాదంలో తమిళకూలీలు వాహనంలో 9 మంది ఉన్నట్లు వెల్లడించారు. బాషాభాయ్ వెనకున్న వారికోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: