మూడు రాజధానులకు వ్యతిరేకంగా.. రాజధాని రైతులకు కడప జిల్లా మైదుకూరులో తెదేపా నాయకులు సంఘీభావం తెలిపారు. తహసీల్దార్ ప్రేమంతకుమార్‌కు వినతిపత్రం అందజేశారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు ఆధ్వర్యంలో పలువురు పట్టణ, మండల నాయకులు తహసీల్దారు కార్యాలయం చేరుకుని... రాజధాని రైతులకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అసెంబ్లీ సాక్షిగా అమరావతిని రాజధానిగా అంగీకరించి.. అధికారంలోకి రాగానే మాట తప్పి స్వలాభల కోసం 3 రాజధానుల ప్రకటనతో రైతులను మోసం చేయడం సరైందికాదన్నారు. 13 జిల్లాలకు అనువుగా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని... 3 రాజధానుల పాలన అటు ప్రభుత్వానికి, ప్రజలకు ఖర్చు, కాలయాపన తప్ప ఒరిగేది ఏమిలేదన్నారు.
అమరావతినే రాజధానిగా ఉంచాలని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అమరావతి రాజధానిగా ఉంచాలని కోరుతూ అమరావతి రైతులు చేస్తున్న దీక్షలు 300 రోజులకు చేరడంతో వారికి మద్దతుగా కడపలో తేదేపా ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు.
అమరావతి రైతులకు మద్దతుగా స్థానిక తెదేపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కడప జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకులు తహాసీల్దార్ కార్యాలయం ఎదుట అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. జై అమరావతి.. మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దు అంటూ నినదించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలో అభివృద్ధి చెందాలంటే ఒక రాజధాని తోనే సాధ్యమని తెదేపా పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు సంజీవరావు, సుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
ఇదీ చదవండి: