గతంలో లేని విధంగా ఈసారి కడప జిల్లాకు అధిక సంఖ్యలో రేబిస్ టీకాలు సరఫరా చేశారు. ముఖ్యంగా జంతువులు, పశువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల్లో రేబిస్ ఒకటి. ఇది పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ఈ టీకా వేయనున్నారు. తగిన జాగ్రత్తలు పాటించి తమ పెంపుడు జంతువులకు టీకాలు వేయించుకోవాలని జేడీ సత్యప్రకాశ్ తెలిపారు.
రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు గతంలో జిల్లాకు 15 వేల డోసులు వచ్చేవి. కొవిడ్-19 నేపథ్యంలో 18 వేల డోసులు జిల్లాకు వచ్చాయి. ఈ టీకాలను కడప బహుళార్ధ (వీపీసీ) పశువైద్యశాలకు వేయి టీకాలు, పులివెందుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 3 వేలు, పెంపుడు కుక్కలు అధికంగా ఉన్న పట్టణాల పరిధిలోని పశువైద్యశాలలకు పంపారు.
టోకెన్లు తీసుకుని దానిపై సూచించిన సమయానికి యజమాని కుక్కలను తీసుకురావాల్సి ఉంటుందని జేడీ తెలిపారు. రేబిస్ సోకకుండా ప్రభుత్వం అందించే టీకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సోమవారం ఉదయం వీపీసీలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.
ఇదీ చదవండి:
రెండు పదవులు.. నాలుగు పేర్లు.. నెలాఖరులో మంత్రి వర్గ విస్తరణ!