Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా.. నిరసనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని డిమాండు చేస్తూ వైఎస్సార్ జిల్లా మైదుకూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ అనుబంధ శాఖలకు చెందిన ప్రతినిధులు శిబిరం చేరుకుని దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండు చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అనంతపురంలో టీడీపీ నేతలు, తెలుగు మహిళలు నిరసన చేపట్టారు. దీక్షలో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేశారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అక్రమ అరెస్టు చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రజల మద్దతు ఉందని ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన న్యాయమే గెలుస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతారన్నారు.
క్షేమంగా, ఆరోగ్యంగా బయటకు రావాలని రుద్ర మహా మృత్యుంజయ యాగం: తెలుగుదేశం అధినేత చంద్రబాబు క్షేమంగా, ఆరోగ్యంగా బయటకు రావాలని టీడీపీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనాథ్ విజయవాడలో రెండు రోజులు పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అధినేత కోసం కేశినేని శివనాథ్ నిన్న సర్వమత ప్రార్థనలు ఏర్పాటు చేశారు. వేద పండితులు ఈ రోజు రుద్ర మహా మృత్యుంజయ యాగం చేస్తున్నారు. కేశినేని చిన్ని దంపతులు యాగపుజలో పాల్గొన్నారు. చంద్రబాబు కోసం చేస్తున్న ఈ యాగ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, శ్రేణులు హాజరయ్యారు.
వినూత్న రీతిలో నిరసన: టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అరెస్టు నిరసనగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో యువకులు ఉరి తాళ్లు మెడకు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని పూజలు (TDP Leaders Prayers for Chandrababu Naidu) చేసి 108 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం ర్యాలీగా టీడీపీ కార్యాలయం వద్దకు చేరుకుని వినూత్న రీతిలో మెడకు ఉరితాలు వేసుకుని నిరసన తెలిపి రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. వైసీపీ ప్రభుత్వంలో యువతకు ఉరి వేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు దీక్ష ప్రాంగణం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం 9వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్లలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అన్యాయం అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నినదించారు. మాజీ ముఖ్యమంత్రి అక్రమ అరెస్టుపై వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీకి తగిన బుద్ధి చెబుతారని టీడీపీ శ్రేణులు అన్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా.. దీక్షలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలో మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ ఇతర నాయకులు దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు.
జోరు వర్షంలోనూ దీక్ష: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడిలో జోరు వర్షంలోనూ దీక్ష చేపట్టారు. చంద్రబాబు పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా.. అర్ధ నగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా గోనెగండ్లలో రిలే దీక్షలు చేపట్టారు. చంద్రబాబు అరెస్టు అన్యాయమని టీడీపీ శ్రేణులు నినదించారు.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రైతులు సామూహిక దీక్షల్లో పాల్గొన్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును విడుదల చేసేవరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో టీడీపీ నేతలు, చంద్రబాబు అభిమానులు ర్యాలీ చేపట్టారు. చంద్రబాబును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.