ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. పట్టణాల నుంచి పల్లెలకు వ్యాపించటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఓ గర్భిణీకి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావటంతో ఆమెను కడపకు తరలించారు. జమ్మలమడుగు పట్టణానికి చెందిన దంపతులు మే 28వ తేదీన పూణె నుంచి జమ్మలమడుగు చేరుకున్నారు.
వారు ఈ నెల 3వ తేదీన జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు. శనివారం సాయంత్రం భార్యకు పాజిటివ్ తేలడం వల్ల ఆమెను అంబులెన్స్‌లో కడపకు తరలించారు. అత్తమామలతో సహా భర్తకు నెగిటివ్ రిపోర్ట్ రావటంతో ప్రొద్దుటూరు క్వారంటైన్‌కు తరలించారు. జమ్మలమడుగు పట్టణంలో కరోనా పాజిటివ్ రావటంతో పోలీసు, పారిశుద్ధ్యం, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు.
బాధితులు నివసిస్తున్న ప్రాంతంలో బ్లీచింగ్ పౌడర్ చల్లించి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేయించారు. పాజిటివ్ తేలిన ప్రాంతంలోకి ఇతరులు వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్ సడలింపుల కారణంగా ప్రజలను కట్టడి చేయలేక పోతున్నామని... ప్రతి ఒక్కరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని భౌతిక దూరం పాటిస్తూ తప్పనిసరిగా మాస్క్ ధరించి బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి : 'కరోనా సంక్షోభంలో ఎమ్మెల్యే పెళ్లి వేడుకలా.. సిగ్గుచేటు'