కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన గర్భిణి... వైద్యం చేసే సమయంలో మృతి చెందడంపై బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం సృష్టించింది. పుల్లంపేట మండలం వల్లూరుపల్లి గ్రామానికి చెందిన నాగమణెమ్మ(25)ను కాన్పు కోసం ఈ నెల 3న రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇవాళ ఉదయం వైద్యం చేస్తుండగా.. ఆమె మృతి చెందింది.
వైద్యుడి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆరోపించిన ఆమె బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయినట్లు ఆరోపించారు. 50 వేల రూపాయలు ఇస్తే బయట ప్రైవేట్ హాస్పిటల్లో ఆమెకు ఆపరేషన్ చేస్తానని ఆ వైద్యుడు చెప్పినట్లు బంధువులు ఆరోపించారు.
అయితే.. ఆమె పరిస్థితి బాగా లేదని.. పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని ముందుగానే సూచించానని డాక్టర్ అనిల్ చెప్పారు. ఇక్కడ ఆపరేషన్ చేయవలసి వస్తే మత్తు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ లేడని బాధితులకు చెప్పానన్నారు. అయినా.. కాన్పు చేయాలని వారు కోరారని.. గర్భిణికి ఫిట్స్ రావడంతోనే చనిపోయిందని డాక్టర్ వివరణ ఇచ్చారు. తన తప్పు లేదని స్పష్టం చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువురితో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దారు.
ఇదీ చదవండి:
మాస్కులు పెట్టుకోవాల్సిందే.. భౌతిక దూరం పాటించాల్సిందే: ఎస్పీ అన్బురాజన్