Prasanna Awareness on Save Trees with Paintings: ఆర్టిస్టుగా రాణించాలనే ఉద్దేశంతో.. ప్రముఖ చిత్ర కళాకారుడు తుపాకుల మహేశ్ వద్ద శిక్షణ తీసుకుంటోంది ఈ యువతి. నాలుగేళ్లుగా ఎన్నో రకాల వైవిధ్యమైన చిత్రాలను ఇండియన్ కలర్స్‌లో వేస్తూ అబ్బురపరుస్తోంది. కేవలం సందేశాత్మక వర్ణ చిత్రాలు మాత్రమే కాక.. ప్రముఖుల చిత్రాలను కూడా వేస్తూ వారికి బహుమానంగా అందిస్తోంది.
Nature Loving Young Painter Prasanna: కుంచెతో అందమైన బొమ్మలు వేస్తున్న ఈ అమ్మాయి పేరు కొడవలూరు ప్రసన్న. వై.ఎస్.ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రామచంద్రరాజు, మంజువాణి దంపతుల రెండో కుమార్తె. ఇంటర్మీడియట్ తర్వాత ఏడాది పాటు చెన్నైలో హిందీ పండిట్ శిక్షణ పూర్తి చేసింది. ఆ తర్వాత చదువుపై అంతగా ఆసక్తి చూపని ప్రసన్న.... తనకు చిన్నతనం నుంచి ఎంతో ఇష్టమైన డ్రాయింగ్‌పై మక్కువ పెంచుకుంది.
తండ్రి కళ్లలో ఆనందం కోసం.. సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించాడో కుమారుడు
అలా పెయింటింగ్స్ వేయడం ప్రారంభించిన ప్రసన్న.. అందరిలా ఏదో ఒక పెయింటింగ్స్ కాకుండా పర్యావరణం అనే థీమ్‌తో తను చిత్రాలు గీయడం ప్రారంభించింది. సేవ్ ది నేచర్ (Save The Nature) అనే సందేశాన్ని ప్రముఖల ద్వారా పంపాలని నిర్ణయించుకుంది. అదే సంకల్పంతో.. వారికి ఇచ్చే పెయింటింగ్ లో "సేవ్ ట్రీస్" అనే లోగో వేసి ఇస్తోంది. ఆ లోగోను ప్రముఖ పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్నాటకకు చెందిన తిమ్మక్క చేతుల మీదుగా ఆవిష్కరింపజేసింది ప్రసన్న. దీని ద్వారా ప్రముఖుల సందేశాలను, ఆటోగ్రాఫ్‌లను తీసుకుని భద్రపరుచుకుంటోంది ఈ యువతి.
ఈ నాలుగేళ్ల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 100మంది ప్రముఖుల చిత్రాలను వేసింది ప్రసన్న. అందులో సినీ, రాజకీయ, న్యాయ కోవిదులు వంటి వారు ఉన్నారు. వారి చిత్రాలను అందమైన పెయింటింగ్స్‌గా వేస్తూ.. ఆ ప్రముఖులకే ఉచితంగా అందిస్తోంది. ఫలితంగా చెట్లను కాపాడాలనే సందేశాన్ని ప్రజల్లోకి పంపుతోంది ఈ యువతి.
Students Farming: అగ్రికల్చరల్ విద్యార్థుల పొలం బాట.. అటు చదువు.. ఇటు వ్యవసాయం..
ఓ వైపు తల్లిదండ్రులకు చేదోడూ వాదోడుగా ఉంటూనే... మరో వైపు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తోంది ప్రసన్న. అంచెలంచెలుగా ఎదుగుతున్న తీరును చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
"సేవ్ ట్రీస్" పేరుతో ప్రసన్న చిత్రాలు వేయడం సంతోషంగా ఉందని... రాబోయే కాలంలో మంచి చిత్రకారిణిగా గుర్తింపు పొందుతుందనే ఆశాభావాన్ని గురువు తుపాకుల మహేశ్ వ్యక్తం చేస్తున్నాడు. నేర్చుకోవాలన్న తపన, పట్టుదల ప్రసన్నలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉందని చెబుతున్నాడు.
ఎక్కడపడితే అక్కడ చెట్లు నరికేస్తున్న నేటి సమాజంలో... వాటిని కాపాడాలనే మంచి సదుద్దేశంతో ప్రసన్న చేస్తున్న కృషి అభినందనీయం. అటు పెయింటింగ్‌లోనూ రాణిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ యువతి ఎందరికో ఆదర్శప్రాయం.
"నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం.. చదువు మీద కంటే చిత్రలేఖనం పట్ల నాకు ఆసక్తి ఎక్కువగా ఉండటం వల్ల నేను ఈ రంగాన్ని వృతిగా ఎంచుకున్నాను. నా మొదటి గురువు మా అమ్మే.. నాకు ఆర్ట్స్ పట్ల ఉన్న ఇష్టాన్ని గమనించిన తాను మా గురువైన తుపాకుల మహేష్ దగ్గరికి నన్ను తీసుకెళ్లింది. నేను ఆయన దగ్గరకు వెళ్లిన మూడు నెలల్లోనే చాలా నేర్చుకున్నాను. ఆర్ట్ పట్ల నాకున్న ఆసక్తిని గమనించిన మా గురువు నన్ను ఎంతో ప్రోత్సహించారు." -కొడవలూరి ప్రసన్న, చిత్రకారిణి
Tribal Traditions: ఆ కళాశాలలో చదువుతో పాటు.. జానపద కళలకు జీవకళ