YSRCP and TDP Leaders Throwing Challenges at Each Other: కడప అభివృద్ధిపై వైఎస్సార్సీపీ - టీడీపీ నాయకులు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న నేపథ్యంలో.. కడపలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో నేడు బహిరంగ చర్చకు రావాలని వైఎస్సార్సీపీ నేతలు సవాల్ విసిరడంతో టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. దీంతో కడప నగరంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
అదే విధంగా వాళ్ల ఇళ్ల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల వ్యవహరిస్తున్న తీరుని నిరసిస్తూ.. ఇంటి వద్ద శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు ఇంటి బయట నుంచి ఆందోళన చేశారు.
పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని, మిగిలిన టీడీపీ నాయకులను బలవంతంగా బయటికి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. పోలీసుల వాహనాన్ని టీడీపీ నాయకులు అడ్డగించి.. వెళ్లకుండా ఆందోళన చేయడంతో వారిని కూడా పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. వీళ్లందరినీ ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు.
టీడీపీ నాయకులు బయటకు రాకుండా.. పోలీసులను ఉపయోగించి.. వైసీపీ నేతలు అడ్డుకోవడం దారుణమని తెలుగుదేశం నాయకులు అన్నారు. సవాల్ విసిరిన వైసీపీ నేతలను రోడ్లపైకి వదిలి.. టీడీపీ నేతలను అరెస్టు చేయడంపై.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీంతో ఇరు పార్టీల సవాళ్ల నేపథ్యంలో నగరంలోని ఏడు రోడ్ల కూడలిలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు టీడీపీ నేతలు చర్చకు సిద్ధం కావడంతో.. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇంటి వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదే విధంగా కడప ఏడు రోడ్ల కూడలి వద్ద ఆందోళనకు వచ్చిన వైఎస్సార్సీపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి.. వాళ్లందరినీ పోలీసు స్టేషన్కు తరలించారు.
"వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. కడప నగరానికి చెందిన కార్పొరేటర్లు.. అభివృద్ధిపై చర్చకు రావాలని తెలుగుదేశం పార్టీ వాళ్లని చాలెంజ్ చేశారు. మేమేం వాళ్లని అడగలేదు. వాళ్లంతట వాళ్లే.. చాలెంజ్ చేశారు. దానిపై చర్చకు రమ్మంటే.. మేము 16వ తేదీన వస్తాం అని చెప్పాం. కానీ ఈ రోజు మా ఇంటి దగ్గరకు పోలీసులు వచ్చి.. హౌస్ అరెస్టు చేశారు". - శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు
ఇవీ చదవండి: