కడప జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పుట్టి ప్రకారం జరుగుతోంది. పుట్టికి 8 బస్తాలు (బస్తా 75 కిలోలు) ప్రకారం ప్రభుత్వం ప్రకటించిన ధరను బట్టి చూస్తే రూ.11,328 అవుతుంది. రైతుల దగ్గర పుట్టి రూ.9 వేలు, రూ9,500కు మాత్రమే కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నెమ్ము 17 శాతం వరకు ఉంటే ప్రభుత్వ ధర చెల్లించాలి. అయితే ఎండినా.. నెమ్ము ఉందని, తాలుందని, మట్టిపెళ్లలు ఉన్నాయని ఇలా కారణాలు చెప్పి తక్కువ ధర చెల్లిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. రైతులు ఆరబెట్టేందుకు వీలులేక వచ్చిందే చాలనే ఉద్దేశంతో ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలులో జరిగే తంతును చూస్తే అక్రమాలు పట్టుకోలేని విధంగా రూపకల్పన చేసి.. పత్రాలపై పక్కాగా రాసేస్తున్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వ ధరకే బిల్లు వేయించుకుంటున్నారనే అభియోగం వినిపిస్తోంది. సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే జమవుతుంది. అందువల్ల రైతుల పేర్లు తమకు అనుకూలంగా ముందుగానే రైతు భరోసా కేంద్రాల్లో రాయించుకుంటున్నారా? లేదా కొనుగోలు చేసిన రైతులతోనే ఒప్పందం చేసుకుంటున్నారా? గతంలో పసుపు కొనుగోలు చేసిన రీతిలో చేస్తున్నారా? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.
రూ.6 వేలకే అమ్ముదామనుకున్నా..
చిత్రంలో రంగు మారిన ధాన్యాన్ని చూపిస్తున్న ఈ రైతు పేరు శీను, స్వగ్రామం చాపాడు మండలం కేతవరం. రూ.1.10 లక్షల పెట్టుబడి పెట్టి నాలుగెకరాల్లో వరి పంట సాగు చేశారు. రెండు వారాల కిందట పంట నూర్పిడి చేశారు. వ్యాపారులను సంప్రదిస్తే ధాన్యం రంగు మారిందంటున్నారు. పుట్టి రూ.10 వేలు ధర పలికేది. కనీసం రూ.6 వేలకు అమ్ముదామన్నా ఎవరూ ముందుకు రావడంలేదని ఆయన వాపోయారు.
ఇంట్లోనే 150 బస్తాలు
ధర లేకపోవడం, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో సాగు చేసిన 20 ఎకరాల్లోని 150 బస్తాల ధాన్యం దిగుబడిని ఇంట్లోనే నిల్వ చేశాను. అమ్ముకుందామనుకుంటే పుట్టి రూ.6 వేలకు అడుగుతున్నారు. కనీస మద్దతు ధర అందడం లేదు. ధాన్యం కొనుగోలు చేసేవారు లేక రోజూ ఆరుబోసుకుని నిల్వ ఉంచుకుంటున్నాం. అధికారులు కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాలి.
- లక్ష్మిదేవి, చిన్నమాచుపల్లె, చెన్నూరు మండలం.
కనీసం తవుడు ధరైనా ఇవ్వండి చాలు!
తడిసిన ధాన్యం చూపుతున్న ఈ రైతు పేరు పామిలేటిరెడ్ఢి ఈయనది చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె. తొమ్మిది ఎకరాలు కౌలుకు వరి పంటను సాగు చేశారు.. ఎకరాకు 20 బస్తాలకు మించి దిగుబడి రాలేదు. కార్పొరేషన్ పరిధిలోకి వస్తుందని అంతర్జాలం నుంచి కొనుగోలు చేయడం కుదరదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళారులు పుట్టి రూ.7 వేలకు ఇవ్వమని అడుగుతున్నారని, గేదెలకు మేతగా వేసే తవుడుకు చెల్లించే ధర చెల్లిస్తే చాలని అడిగినా ఆసక్తి చూపడం లేదని వాపోయారు.
బస్తా రూ.500కు అడుగుతున్నారు
ఎకరా సొంత భూమితో పాటు ఏడెకరాలు కౌలుకు చేస్తున్నాను. ఆలయ భూములు కావడంతో ముందుగానే ఎకరాకు రూ.18,500 చొప్పున రూ.1.14 లక్షలు కౌలు చెల్లించాను. పది రోజుల కిందట పంట కోత కోయగా ఎకరాకు 16 బస్తాలొచ్చాయి. కోత యంత్రానికి గంటకు రూ.3,500 ఖర్చయింది. ధాన్యం ఉన్న రైతుల వివరాలు రైతు భరోసా కేంద్రంలో నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తుందని దళారులు పొలాల్లో ప్రవేశిస్తున్నారు. బస్తా రూ.500కు అడుగుతున్నారు. కనీసం బస్తా రూ.వెయ్యి కూడా పలకకపోవడం దారుణం.
- మల్లం నాగయ్య, చిన్నవరదాయపల్లె, చాపాడు మండలం.
అన్యాయం జరుగుతోంది...
ధాన్యం కొనుగోలు వ్యవహారంలో రైతుకు అన్యాయం జరుగుతోంది. కొందరు కొనుగోలుదారులు, అధికారులు కుమ్మక్కై ధరలు తగ్గించి కొనుగోలు చేసి బిల్లు మాత్రం పక్కాగా వేయించుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
- చంద్ర, జిల్లా రైతు సంఘం నాయకుడు
సమాచారం రాగానే...
రైతు భరోసా కేంద్రాల నుంచి సమాచారం రాగానే ధాన్యం సిద్ధంగా ఉందని మిల్లర్లకు సమాచారమిచ్చి రైతు వద్దకు తీసుకెళతాం. అక్కడ చూసి ధాన్యం నిబంధనల ప్రకారం ఆరవేసి ఉంటే తూకం ఎప్పుడు వేసేది చెబుతాం. లేదంటే ఆరబెట్టాలని సూచిస్తాం. నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించేదిలేదు.
- మహబూబ్‌పీర్, జిల్లా అధికారి, డీసీఎంఎస్
ఎలాంటి అక్రమాలు లేవు...
ధాన్యం కొనుగోలులో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోవడంలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పక్కాగా కొనుగోలు చేస్తున్నాం. ఇసుమంతైనా అవకతవకలు జరగడంలేదు. రైతుల వద్ద ఉన్న ధాన్యంతోపాటు పొలాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. రైతుల ఖాతాల్లో నగదు జమవుతోంది.
- పద్మ, జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారిణి
ఇదీ చదవండి: