కడప జిల్లా ఓబుళాపురంలో సుమారు 12వందల మంది జనాభా నివసిస్తున్నారు. 750 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా... గ్రామాన్ని వదిలేసి పొలాలను ముంపు జాబితాలో చేర్చారు. ఆరు వందల ఎకరాలు ముంపునకు గురవుతాయని గుర్తించిన అధికారులు... కొంతమందికి మాత్రమే పరిహారం చెల్లించారు. ప్రస్తుతం గండికోట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. 26 టీఎంసీలకు పైగా నీరు రావడం వల్ల.... ఇంజనీర్ల లెక్క తప్పింది. కాపు దశలో ఉన్న విలువైన చీనీ , నిమ్మ తోటలు నీట మునిగాయి. చేతికొచ్చిన పంట కళ్లెదుటే కుళ్ళిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
ఓబుళాపురాన్ని గండికోట జలాలు చుట్టుముట్టి గ్రామస్థులు ఎటూ పోలేని పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్నామని.. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని.. స్థానికులు కోరుతున్నారు. గ్రామం చుట్టూ గండికోట నీరు చేరి... కంటి మీద కునుకు లేకుండా పోతుందని గ్రామస్థులు వాపోతున్నారు. దోమలు, పాములతో ఇబ్బంది పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్చాలని జలదీక్ష ద్వారా నిరసన తెలియజేస్తున్నారు.
ఇదీ చదవండి: అపాచి షూ కంపెనీ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన