AP MLC Election Nominations: రాష్ట్రంలోని పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటరాగా.. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా వేపాడ చిరంజీవిరావు నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ భాజపా అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ విశాఖ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నేతలు విపరీతంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వాలంటీర్లను, వెలుగు ఉద్యోగస్తులను ఉపయోగించుకుంటున్నారు. సాక్షాత్తు ప్రధాన విద్యాలయం అయినటువంటి విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఒక బాధ్యతగల పదవిలో ఉండి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత వైసీపీ నాయకులతో కలిసి ఎలక్షన్ క్యాంపేనింగ్లో పాల్గోవడం ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తున్నాని అంటున్నాను.- అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
జోరుగా నామినేషన్: కడప జిల్లా స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామసుబ్బా రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డితో కలిసి వచ్చి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గం అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు రోజా, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ ర్యాలీలో పాల్గొన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నుపూస రవీంద్రారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సత్యసాయి జిల్లా కదిరి ఆర్ అండ్ బీ బంగ్లాలో వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి ఉపాధ్యాయులు, అధ్యాపకులతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ భర్త కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశం అవడం వివాదస్పదమైనా సరే.. ఏ మాత్రం లెక్కచేయక కల్పలతారెడ్డి ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ వ్యవహారంపై విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
అడుగడుగున విమర్శలు: జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడంతో అడుగడుగున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ఆయన అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన అప్రజస్వామిక పాలన సాగిస్తూ అన్ని వర్గాల విశ్వాసాన్ని కోల్పోయిన జగన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు తొలి అవకాశమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. చంద్రబాబు పాలనలోనే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న, ప్రజల వాణిని నిరుద్యోగుల సమస్యలను, ఉద్యోగుల సమస్యలను పట్టభద్రులు సమస్యలను బలంగా వినిపించడంతోపాటు ఆ సమస్యలను పరిష్కరించడానికి రాజీలేని పోరాటం చేసే మనస్తత్వం ఉన్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గెలిపించాలన్నారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ విజయాలకు బలమైన పునాదివేయాలని కోరారు.
అధికార పార్టీకి వర్తించని ఎన్నికల కోడ్: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ నేపథ్యంలో వైసీపీ నాయకులకు ఎన్నికల కోడ్ వర్తించవా అంటూ సోషల్ మీడియాలో వైసీపీ నాయకుల ర్యాలీ వీడియోలు వైరల్గా మారాయి. ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెన్నపూస గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగమ్మ నామినేషన్ దాఖలు చేయడానికి కలెక్టర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున వైసీపీ నేతలతో ర్యాలీగా వచ్చారు. అయితే ఎన్నికల నిబంధన మేరకు ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ వైసీపీ నాయకులకు వర్తించవా అంటూ పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి వీరి పర్యటనలతో అనంతపురం నగరంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగుల బంధువులు రోడ్డు దాటడానికి అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. గంటల తరబడి రోడ్డుపై నిరీక్షణ పరిస్థితి వచ్చింది. ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నామినేషన్ సమయంలో ర్యాలీగా వస్తూ అంబేద్కర్ విగ్రహం వద్దకు కాళ్లకు చెప్పులు వేసుకుని పూలమాల వేయడానికి వెళ్లారని ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు తీవ్రంగా ఖండించారు. అనంతపురంలో వైసీపీ నాయకుల ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఇవీ చదవండి: