Joinings in Telugu Desam Party : వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర చేస్తున్న క్రమంలో కమలాపురం నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో 10 పంచాయతీలకు సంబంధించిన వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు వైఎస్సార్సీపీని వీడి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారందరికీ నారా లోకేశ్ పసుపు పచ్చ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వల్లూరు మండలం తప్పెట్ల గ్రామపంచాయతీ వైఎస్సార్సీపీ సర్పంచ్ శాంతి తో పాటు ఆమె భర్త సుధాకర్ రెడ్డి అనేకమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు.
వచ్చే ఎన్నికల్లో కమలాపురంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ కార్యకర్తలు పనిచేయాలని అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాక్షసపాలనను అంతమొందిస్తేనే కడప జిల్లా వాసులకు స్వేచ్ఛ కలుగుతుందని తెలిపారు. చెన్నముక్కపల్లి విడిది కేంద్రంలో కమలాపురం నియోజకవర్గం తప్పెట్ల గ్రామానికి చెందిన సర్పంచ్ గడికోట శాంతి, భర్త సుధాకర్ రెడ్డి, గండిరెడ్డిపల్లికి చెందిన మాజీ సర్పంచులు గాలి ప్రసాద్ రెడ్డి, దర్శన్ రెడ్డి, మిట్టపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, గోనుమాకపల్లికి చెందిన మాజీ ఎంపీటీసీ శేఖర్ రెడ్డి, అంబవరం మాజీ ఎంపీటీసీ ముంతా జానయ్య, సీనియర్ నేతలు రామసుబ్బారెడ్డి, నాగేంద్ర రెడ్డి, దళిత నేతలు కొప్పుల జగన్, అనిల్, చంటితో పాటు పలువురు దళిత యువకులు సోమవారం లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. అదే విధంగా మిట్టపల్లికి చెందిన 20 కుటుంబాలు, గంగిరెడ్డిపల్లికి చెందిన 30 కుటుంబాలు, గోనుమాకులపల్లికి చెందిన 30 కుటుంబాలు, అలిదిన, పాయసంపల్లి, పడదుర్తి, చడిపిరాళ్లకు చెందిన ఎస్సీలు, ఎస్ఆర్ నగర్, జెబి నగర్ కాలనీ, ఉప్పర్పల్లికి చెందిన 40 కుటుంబాలు, తోలగంగనపల్లికి చెందిన 8 కుటుంబాలతో పాటు పలువురు టీడీపీలో చేరారు.
టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామిని అత్యంత అమానవీయంగా అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అప్రజాస్వామిక పాలనకు ఇలాంటి ఉదంతాలు పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, జగన్ సర్కారు అవినీతిని ప్రశ్నిస్తున్నారనే... శాంత స్వభావి, దళిత మేధావి అయిన డాక్టర్ స్వామిని టార్గెట్ చేసి మరీ వేధిస్తున్నారని ఆక్షేపించారు. విపక్ష దళిత ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించే ప్రయత్నం చేయడం.. అధికార పార్టీ కవ్వింపు చర్యగా ఆయన పేర్కొన్నారు. డాక్టర్ స్వామిపై దాడిని లోకేశ్ తీవ్రంగా ఖండించారు.