Lokesh meets the leader in jail: వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్తో పాటు మరికొందరు తెదేపా నాయకులను అరెస్టు చేయడంతో.. వారికి భరోసా కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడపలో పర్యటించారు. ఉదయం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకున్న లోకేశ్‌కు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయం నుంచి కడప జైలు వరకు అడుగడుగునా పార్టీ నాయకులు, అభిమానులు, మహిళలు నీరాజనం పట్టారు. దాదాపు 500 పైగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. గజమాలతో లోకేశ్‌కు స్వాగతం పలికారు.
కడప జైల్లో ఉన్న ప్రవీణ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఆరుగురని లోకేశ్ పరామర్శించారు. అక్కడనుంచి నేరుగా ప్రొద్దుటూరులోని ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన భార్య మౌనిక రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎలాంటి సమస్య వచ్చినా.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాదాపు గంటపాటు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వైకాపా నాయకుల దాడిలో గాయపడ్డ కార్యకర్త మూర్తిని సైతం కలిశారు. ఆయనను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు.
ప్రవీణ్ కుమార్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చాక.. రాజకీయంగా మరింత బలంగా తయారవుతారని.. ఆయన భార్య మౌనిక రెడ్డి స్పష్టం చేశారు. వైకాపా చేస్తున్న ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తారని చెప్పారు. మనిషిని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తే బలహీనపడతారని వైకాపా అనుకుంటే.. అది పొరపాటేనని ఆమె అన్నారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని.. నారా లోకేశ్ భరసా ఇచ్చినట్లు ఆమె తెలిపారు.
ఇవీ చదవండి: